అమ్మ బాటలో... | Yashdeep in the World Cup Hockey Tournament | Sakshi
Sakshi News home page

అమ్మ బాటలో...

Jul 24 2026 3:45 AM | Updated on Jul 24 2026 3:45 AM

Yashdeep in the World Cup Hockey Tournament

ప్రపంచకప్‌ హాకీ టోర్నీ బరిలో యశ్‌దీప్‌ 

నాడు తల్లి... నేడు తనయుడు

1998 ప్రపంచకప్‌ టోర్నీలో భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రీతమ్‌ రాణి

28 ఏళ్ల తర్వాత అదే వేదికపై భారత పురుషుల జట్టుకు ఆడనున్న యశ్‌దీప్‌

సాక్షి క్రీడా విభాగం : దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారత మహిళల హాకీ జట్టు... నెదర్లాండ్స్‌ వేదికగా ప్రపంచకప్‌ బరిలోకి దిగింది. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టు 12వ స్థానంతో సరిపెట్టుకోగా... జట్టుకు సారథిగా వ్యవహరించిన ప్రీతమ్‌ రాణి సివాచ్‌ దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అదే నెదర్లాండ్స్‌ వేదికగా... పురుషుల హాకీ ప్రపంచకప్‌ జరగనుండగా... ప్రీతమ్‌ సివాచ్‌ కుమారుడు యశ్‌దీప్‌ సివాచ్‌ భారత జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో హాకీ ప్రపంచకప్‌లో ఆడిన తొలి భారత తల్లీకుమారులుగా ప్రీతమ్, యశ్‌దీప్‌ రికార్డుల్లోకెక్కనున్నారు. 

ఆగస్టు 14 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం 20 మందితో కూడిన భారత జట్టును ఇటీవల ప్రకటించగా... అందులో 25 ఏళ్ల డిఫెండర్‌ యశ్‌దీప్‌ సివాచ్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘ఇది నాకెంతో ప్రత్యేకమైంది. వరల్డ్‌కప్‌ ఆడే భారత జట్టులో చోటు దక్కిన వెంటనే ఈ విషయం మొదట అమ్మకు చెప్పా. ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 

ఎందుకంటే 1998లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాంటిది అక్కడే నేను వరల్డ్‌కప్‌ ఆడనుండటం చాలా ప్రత్యేకమైన విషయం’ అని అన్నాడు. తన కాలంలో భారత మహిళల జట్టు అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతమ్‌... 2002 మాంచెస్టర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. 

ఇంటి నిండా ఫొటోలే... 
యశ్‌దీప్‌ పుట్టక ముందే ప్రీతమ్‌ ప్రపంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రీతమ్‌... తన కెరీర్‌కు సంబంధించిన విశేషమైన సందర్భాల ఫొటోలను ఇంటి నిండా అతికించారు. చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగిన యశ్‌దీప్‌ ఇప్పుడు అత్యున్నత స్థాయిలో బ్లూ జెర్సీలో వరల్డ్‌కప్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మా ఇంటి నిండా అమ్మా హాకీ ఆడే ఫొటోల ఆల్బమ్‌లు ఉన్నాయి. టోర్నమెంట్‌లలో పాల్గొన్నవి, ట్రోఫీలు అందుకున్నవి, జట్టు సభ్యులతో కలిసి దిగినవి... ఇలా లెక్కలేనన్ని ఫొటోలు ఉన్నాయి. 

                                                               సోదరి కనిక 

చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగాను. అమ్మ సహచరులు చాలా మంది నుంచి ఎన్నో విలువైన సలహాలు పొందాను’ అని యశ్‌దీప్‌ వెల్లడించాడు. చిన్నప్పుడు స్విమ్మింగ్‌పై మక్కువ చూపిన అతడు... 2010లో న్యూ ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసిన తర్వాత హాకీపై దృష్టి సారించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల సూచనతో మెరుగైన శిక్షణతో అంచలంచెలుగా ఎదిగిన యశ్‌దీప్‌... తన ప్రతిభతో భారత జూనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ నిలకడైన ప్రదర్శన కనబర్చడంతో అతడికి సీనియర్‌ జట్టులో చోటు దక్కింది.   

                                                            తల్లిదండ్రులతో.. 

తల్లిని మించిన తనయుడవ్వాలి! 
తొలిసారి ప్రపంచకప్‌ బరిలోకి దిగనున్నప్పటికీ... ఎలాంటి బెరుకు లేకుండా ఆడాలనుకుంటున్నట్లు యశ్‌దీప్‌ వెల్లడించాడు. ఇప్పటికే ఆ్రస్టేలియాలో క్లబ్‌ల తరఫున ఆడిన అనుభవం ఉన్న యశ్‌దీప్‌... హెడ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ సూచనలు తనకెంతో మేలు చేశాయని చెప్పాడు. ‘హెడ్‌ కోచ్‌ ఎప్పుడూ ఆటను మార్చుకోమని ఒత్తిడి చేయలేదు. నా సహజసిద్ధమైన ఆటతీరు కొనసాగించమని చెప్పారు. భువనేశ్వర్‌లో జరిగిన ప్రొ లీగ్‌ సందర్భంగా ప్రత్యర్థి ఎవరైనా మనకు అవసరం లేదు... మన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన చెప్పిన మాటలు ఎంతో ప్రభావం చూపాయి’ అని యశ్‌దీప్‌ అన్నాడు. 

ఇక కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, సీనియర్‌ ప్లేయర్లు అమిత్‌ రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పాడు. చిన్నప్పటి నుంచి వారి ఆట చూస్తూ పెరిగి... ఇప్పుడు వారితోనే కలిసి ప్రపంచకప్‌ ఆడనుండటం ఆనందంగా ఉందని ఈ డిఫెండర్‌ వెల్లడించాడు. 2021లో జూనియర్‌ ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో సభ్యుడైన యశ్‌దీప్‌... సీనియర్‌ స్థాయిలో పోటీ మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నన్నంతా ప్రీతమ్‌ రాణి సివాచ్‌ కుమారుడు అని గుర్తిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు యశ్‌దీప్‌ సివాచ్‌ తల్లి ప్రీతమ్‌ రాణి అనే స్థాయికి ఎదగాలనేదే నా లక్ష్యం’ అని యశ్‌దీప్‌ వివరించాడు.  

కుటుంబం మొత్తం ప్లేయర్లే! 
యశ్‌దీప్‌ సివాచ్‌ కుటుంబం మొత్తం హాకీ క్రీడాకారులే. అతడి తండ్రి కుల్దీప్‌ మంచి హాకీ ప్లేయర్‌. దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న కుల్దీప్‌ను గాయాలు వెనక్కి లాగాయి. దీంతో అతడు తన భార్య ప్రీతమ్‌ సివాచ్‌ పేరిట హరియాణాలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీలో యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడంలో మునిగిపోయాడు. ఇక యశ్‌దీప్‌ సోదరి కనిక ఇప్పటికే భారత జూనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. నిలకడగా రాణిస్తున్న కనిక... సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. 

ప్రీతమ్‌ మిడ్‌ఫీల్డర్‌ కాగా... కనిక ఫార్వర్డ్‌ ప్లేయర్‌. వీరిద్దరికీ భిన్నంగా తండ్రి కుల్దీప్‌ సూచనతో యశ్‌దీప్‌ డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు. ‘మా అమ్మా, సోదరికి గోల్స్‌ చేయడం అంటే ఇష్టం కానీ. నాకు వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడం ఇష్టం. దాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తా. నేను చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌కు పెద్ద ఫ్యాన్‌ను. అందుకే నాకు స్కోర్‌ చేయడం కన్నా దాన్ని అడ్డుకోవడం ఇష్టం. మా నాన్న మంచి డిఫెండర్‌... చిన్నప్పటి నుంచి నన్ను కూడా అదే దిశగా ప్రోత్సహించారు’ అని యశ్‌దీప్‌ వెల్లడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement