PC: X
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ మైక్ హసన్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఈ జట్టును ఓడించడం అంతతేలికేమీ కాదన్నాడు. పాకిస్తాన్‌తో పాటు ఇతర జట్లు కూడా టీమిండియాను ఓడించేందుకు విఫలయత్నం చేస్తున్నాయని మైక్ హసన్ పేర్కొన్నాడు.
కాగా ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్ 2027లో జరుగనున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు అక్టోబరు 4- నవంబరు 21 మధ్య షెడ్యూల్ ఖరారైంది.
టీమిండియాతో ప్రతి జట్టుకూ అదే సమస్య
ఈ నేపథ్యంలో క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన పాక్ హెడ్‌కోచ్ మైక్ హసన్ టీమిండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన జట్టుగా కనిపిస్తోందన్నాడు. ‘‘గతేడాది ఆసియా కప్ టోర్నీలో టీమిండియాపై తప్ప మేము అన్ని మ్యాచ్‌లూ గెలిచాము.
నిజానికి పాక్ ఒక్కటే కాదు... ప్రపంచంలోని ఇతర జట్లు కూడా ప్రస్తుతం టీమిండియాను ఓడించేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. మళ్లీ అదే మాట చెప్పేందుకు నేను వెనకాడను. పాక్ జట్టుకు మాత్రమే కాకుండా ప్రతి జట్టుకూ ఇదే సమస్య.
కేవలం అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు
తప్పో.. ఒప్పో.. ప్రతి ఒక్కరు ఇండియాతో మ్యాచ్ ఫలితంతోనే పాకిస్తాన్ జట్టుపై ఓ నిర్ణయానికి వస్తారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు.. అంతకంటే ఓ మెట్టుపైనే ఉందనడంలో అతిశయోక్తి లేదు’’ అని మైక్ హసన్ గిల్ సేనపై ప్రశంసల వర్షం కురిపించాడు.
టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం
కాగా పాకిస్తాన్ చివరగా 2017లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టైటిల్ సాధించింది. ఇక 2022 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన పాక్.. ఆ తర్వాత ఈ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది.
మరోవైపు.. వన్డే ఫార్మాట్లోనూ 2011 తర్వాత పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరలేదు. ఇక టీమిండియా ఇటీవల వరుసగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచింది. 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మాత్రం పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఓవరాల్‌గా టీమిండియా పాకిస్తాన్ ఇప్పటికి 136 వన్డేల్లో తలపడగా.. పాక్ 73, ఇండియా 58 మ్యాచ్‌లు గెలిచాయి. ఐదింటిలో ఫలితం తేలలేదు. అయితే, వరల్డ్‌కప్ టోర్నీలో మాత్రం ఇరుజట్లు ఎనిమిదిసార్లు తలపడగా.. టీమిండియా 8-0తో దాయాదిపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తోంది.
చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో


