ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక ఖరారు
2027 జూన్ 9 నుంచి 13 వరకు టైటిల్ పోరు
ఇంగ్లండ్‌లోనే తదుపరి 2029, 2031 డబ్యూటీసీ ఫైనల్స్
లండన్: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు లండన్‌లోని ఓవల్ మైదానం వేదిక కానుంది. 2027 జూన్ 9 నుంచి 13 వరకు ఓవల్ గ్రౌండ్‌లో ఈ పోరు జరగనుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం వెల్లడించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్ తరహాలో నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్‌ను 2021లో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లోనే జరుగుతోంది. 2021లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్‌కు సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ మైదానం వేదిక అయింది. తుది పోరులో న్యూజిలాండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి విజేతగా నిలిచింది.
ఆ తర్వాత 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగింది. ఆ్రస్టేలియా జట్టు 209 పరుగుల తేడాతో భారత జట్టుపై గెలిచి తొలిసారి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ఇక 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌ను లండన్‌లోని విఖ్యాత లార్డ్స్ మైదానంలో నిర్వహించారు. తెంబా బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచింది. 2027 తర్వాత జరిగే మరో రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ (2029, 2031) ఆతిథ్య హక్కులు కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే కేటాయించినట్లు ఐసీసీ వెల్లడించింది. అయితే వేదికలను, తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.
ఫార్మాట్ ఇలా...
మొత్తం టెస్టులు ఆడే తొమ్మిది జట్ల మధ్య నిర్వహించే సిరీస్‌లకు పాయింట్లు కేటాయించి... 2025–27 మధ్య కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లను ఫైనల్‌కు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ పట్టికలో ఆ్రస్టేలియా 8 మ్యాచ్‌లాడి ఏడు విజయాలు, ఒక పరాజయంతో 87.50 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక టెస్టులో ఓడి 75.00 విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 72.22 విజయాల శాతం... బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 58.33 విజయాల శాతంతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.
ఈ క్రమంలో 9 మ్యాచ్‌లాడిన 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 48.15 విజయాల శాతంతో భారత జట్టు ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక (41.67 విజయాల శాతం), ఇంగ్లండ్ (24.36 విజయాల శాతం), వెస్టిండీస్ (15.00 విజయాల శాతం), పాకిస్తాన్ (8.33 విజయాల శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అధికారికంగా అన్నీ జట్లకు ఇంకా ఫైనల్ చేరే అవకాశలు ఉన్నాయి. త్వరలోనే ప్రారంభం కానున్న టెస్టు సీజన్‌లో వెస్టిండీస్‌తో పాకిస్తాన్... బంగ్లాదేశ్‌తో ఆ్రస్టేలియా... పాకిస్తాన్‌తో ఇంగ్లండ్.... శ్రీలంకతో భారత్ తలపడనున్నాయి.


