గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు | Gurnoor Brar Punished By ICC For Violent Behaviour Ahead Of 2nd ODI Vs England | Sakshi
Sakshi News home page

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

Jul 16 2026 4:29 PM | Updated on Jul 16 2026 5:06 PM

Gurnoor Brar Punished By ICC For Violent Behaviour Ahead Of 2nd ODI Vs England

Photo credit : x

ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు భారత యువ ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొలి వన్డేలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బ్రార్‌కు ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ, అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.

ఏం జరిగిందంటే..?
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతిని ఫాలోత్రూ సమయంలో అందుకున్న బ్రార్, ఆవేశంతో డకెట్ వైపు వేగంగా విసిరాడు. డకెట్ అప్రమత్తంగా తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, బ్రార్ చర్యను ప్రమాదకరంగా పరిగణించి ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. బ్రార్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాడిపై లేదా అతడి సమీపంలో ప్రమాదకరంగా బంతిని విసరడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తారు.

బ్రార్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా కేసును ముగించారు. ఈ ఘటనకు సంబంధించి బ్రార్‌పై ఆర్థిక జరిమానా విధించలేదు. అయితే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేయడంతో పాటు అధికారిక హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రార్‌కు ఇదే తొలి క్రమశిక్షణా ఉల్లంఘనగా నమోదైంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌పై భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపోంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 45.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ (4-62), బ్రార్‌ (2-61), ప్రసిద్ద్‌ (2-50), బుమ్రా (1-31).. బ్యాటింగ్‌లో గిల్‌ (80), సుందర్‌ (52 నాటౌట్‌), అక్షర్‌ (57 నాటౌట్‌) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement