వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్‌లో మార్పు
14 జట్ల పోరుకు ఐసీసీ ఆమోదం
2027 టోర్నీ నుంచి అమలు
దుబాయ్: మొత్తం 10 జట్లు... ప్రతీ టీమ్ 9 ప్రత్యర్థి జట్లతో తలపడే విధంగా లీగ్ దశ... టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు... ఆపై ఫైనల్. గత రెండు వన్డే వరల్డ్ కప్‌లలో (2019, 2023) నిర్వహించిన ఈ తరహా ఫార్మాట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళం పాడింది. టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నామని చెబుతూ కొత్త ఫార్మాట్‌తో ముందుకు వచ్చింది. ముందే చెప్పినట్లుగా ఐసీసీ జట్ల సంఖ్యను 10 నుంచి 14కు పెంచింది. అయితే ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ సిరీస్, సూపర్–7 దశలు వరల్డ్ కప్‌లోకి వచ్చాయి.
బుధవారం జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫార్మాట్‌కు ఆమోదముద్ర వేశారు. 2027లో దక్షిణాఫ్రికా–జింబాబ్వే–నమీబియా వేదికగా జరిగే ప్రపంచ కప్ నుంచే దీనిని అమలు చేయనున్నారు. నిజానికి 2023 టోర్నీ ఫార్మాట్‌ను తర్వాతి టోర్నీ నుంచి మార్చే విధంగా 2021 జూన్‌లోనే ఐసీసీ కొత్త ప్రతిపాదన చేసింది. జట్ల సంఖ్యను 14కు పెంచడంతో పాటు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించడం, ఆపై 2003 తరహాలో సూపర్–6 దశను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు దీనిని పక్కన పెట్టి తాజాగా కొత్త మార్పులతో ముందుకు వచ్చింది.
సెమీఫైనల్ వరకు వేచి చూడకుండా అంతకుముందు ఆడే రౌండ్‌లలోనే ‘నాకౌట్’ తరహాలో మ్యాచ్‌లను ఆసక్తికరంగా మార్చడమే దీని ఉద్దేశమని ఐసీసీ వెల్లడించింది. వరల్డ్ కప్‌కు మొత్తం 14 జట్లు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 2026 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్న జట్లు నేరుగా క్వాలిఫై కానుండగా... ఆతిథ్య జట్లయిన (పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న) దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు అవకాశం దక్కుతుంది. మిగతా 4 స్థానాల కోసం 10 జట్లతో క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహిస్తారు.
2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ దశలవారీగా ఇలా...
రౌండ్ 1: అర్హత సాధించిన 14 జట్లలో చివరి మూడు స్థానాల్లో ఉన్న (12, 13, 14) జట్లతో ముందుగా సూపర్ సిరీస్‌ను రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారు. వీటిలో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు ముందంజ వేస్తుంది. మిగతా రెండు టీమ్‌లు నిష్క్రమిస్తాయి.
రౌండ్ 2 (30 మ్యాచ్‌లు): మొత్తం 12 టీమ్‌లను 2 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 5 టీమ్‌లతో తలపడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి 3 టాప్ టీమ్‌లతో (మొత్తం 6) పాటు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ తరహాలో రెండు గ్రూప్‌లలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో టీమ్ 7వ జట్టుగా తర్వాతి రౌండ్‌కు చేరుకుటుంది.
రౌండ్ 3, సూపర్–7 (21 మ్యాచ్‌లు): మొత్తం 7 జట్ల ఈ దశలో ప్రతీ టీమ్‌తో ఇతర ప్రత్యర్థులందరినీ ఎదుర్కొంటూ 6 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ఆ తర్వాత ఫైనల్ నిర్వహిస్తారు.
టి20 వరల్డ్ కప్‌లో ‘ఎలిమినేటర్స్’
2028లో ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ టోర్నీ ఫార్మాట్‌లో కూడా ఐసీసీ స్వల్ప మార్పు చేసింది. 2026 తరహాలోనే 20 జట్లు, 55 మ్యాచ్‌లే ఉన్నా... ఈసారి సెమీఫైనల్‌కు ముందు కొత్తగా ‘ఎలిమినేటర్స్’ రౌండ్ పెట్టింది. దీని ప్రకారం అదనంగా రెండు ‘నాకౌట్’ మ్యాచ్‌లు వచ్చి చేరాయి. 2026 వరల్డ్ కప్‌లో ప్రదర్శనను బట్టి 12 జట్లు ఇప్పటికే ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా... 16 జట్లు తలపడే క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రదర్శన ద్వారా మిగతా 8 టీమ్‌లు వరల్డ్ కప్‌లోకి అడుగు పెడతాయి. ప్రస్తుతం టి20 ఫార్మాట్‌లో భారత జట్టు... వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ చాంపియన్స్‌గా ఉన్నాయి.

టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ దశలవారీగా ఇలా...
1. గ్రూప్ దశ (30 మ్యాచ్‌లు): మొత్తం 20 జట్లను ఒక్కో గ్రూప్‌లో 4 చొప్పున 5 గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతీ టీమ్‌లో తన గ్రూప్‌లోని ఇతర మూడు జట్లతో తలపడుతుంది. ప్రతీ గ్రూప్‌లోని టాప్–2 టీమ్‌లు (మొత్తం 10) ముందంజ వేస్తాయి.
2. సూపర్–10 దశ (20 మ్యాచ్‌లు): టీమ్‌లను 5 చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. తమ గ్రూప్‌లోని ఇతర 4 జట్లను టీమ్‌లు ఎదుర్కొంటాయి. రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఒక్కో టీమ్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
3. ఎలిమినేటర్ (2 మ్యాచ్‌లు): సూపర్–10 దశలోని రెండు గ్రూప్‌లలో రెండో, మూడో స్థానంలో నిలిచిన రెండేసి (మొత్తం 4) జట్లు ఈ దశలో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఇక్కడ గెలిచిన టీమ్‌లు మరో సెమీఫైనల్ స్థానాలను పూరిస్తాయి. సెమీస్, ఆపై ఫైనల్ పోరు జరుగుతుంది.


