ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న క్రికెట్ వెస్టిండీస్‌కు (CWI) ఐసీసీ భారీ ఆర్దిక సాయం చేసింది. వార్షిక సమావేశాల్లో భాగంగా CWIకు 12.82 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.110 కోట్లు) రుణంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ బోర్డు ఐసీసీ నుంచి ఆర్థిక సహాయం కోరుతోంది. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికలో 28 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చూపించింది.
2026 ఆర్థిక చక్రంలో మరో 26 మిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ లోటును భర్తీ చేసేందుకు ఐసీసీ రుణం కోరింది. దీంతో ఐసీసీ వారికి అధికారికంగా ఆర్థిక సాయం ప్రకటించింది.
2012లోనూ ఐసీసీ జింబాబ్వే, వెస్టిండీస్ బోర్డ్‌లకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించింది. 2020 కరోనా మహమ్మారి సమయంలోనూ వెస్టిండీస్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నుంచి 3 మిలియన్ డాలర్ల రుణం పొందింది.
ఇతర కీలక నిర్ణయాలు
ఎడిన్‌బర్గ్‌లో జరిగిన సమావేశాల్లో ఐసీసీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మారిషస్‌ను ఐసీసీ 111వ సభ్య దేశంగా చేర్చింది. దీంతో ఐసీసీలో ప్రస్తుతం 12 పూర్తి సభ్య దేశాలు, 99 అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి.
కెనడా క్రికెట్ బోర్డుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేతకు అవసరమైన పునరుద్ధరణ నిబంధనలకు ఆమోదం తెలిపింది. అలాగే శ్రీలంక క్రికెట్ కొత్త రాజ్యాంగంపై వివరాలు స్వీకరించి, ఎన్నికలు పూర్తయ్యే వరకు శ్రీలంకకు బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం ఉండదని స్పష్టం చేసింది. సభ్యత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫ్రాన్స్ క్రికెట్‌కు నోటీసులు జారీ చేసింది.
రెండు కొత్త ఉపసంఘాల ఏర్పాటు
క్రికెట్ పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ఐసీసీ రెండు కొత్త ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. గవర్నెన్స్ రివ్యూ కమిటీ, ఫ్రాంచైజీ లీగ్ కమిటీ పేర్లతో ఏర్పాటైన ఈ కమిటీలు సభ్య దేశాల పరిపాలన, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌ల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విధానపరమైన సూచనలు చేస్తాయి.


