విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం | Virat Kohli Personal Bodyguard Accused Of Manhandling Media, BCCI Action Demand Rises | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం

Jul 15 2026 9:18 PM | Updated on Jul 15 2026 9:20 PM

Virat Kohli Personal Bodyguard Accused Of Manhandling Media, BCCI Action Demand Rises

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్‌పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలం ఉపయోగించాడని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

సోషల్‌మీడియా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓ జర్నలిస్టు భారత జట్టు బస్సు బయలుదేరే దృశ్యాలను (కోహ్లి బస్సులోకి ఎక్కుతుండగా) అధికారిక మీడియా పాయింట్‌లో నిలబడి చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చి సదరు జర్నలిస్టును అక్కడి నుంచి వెళ్లిపోవాలని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

జర్నలిస్టు తన వద్ద అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉందని చెప్పినా, బాడీగార్డ్ పట్టించుకోకుండా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో వెల్లడించడంతో వివాదం ముదిరింది.

బీసీసీఐ నిబంధనలపై ప్రశ్నలు
ఈ ఘటనతో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో వ్యక్తిగత బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

బీసీసీఐ అమల్లో ఉన్న క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భద్రతను బోర్డు, స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన అధికారిక భద్రతా సిబ్బందే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సాధారణంగా అనుమతి ఉండదు.

బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూపు
ఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించలేదు. అయితే ఆరోపణలు నిజమని తేలితే, బీసీసీఐ అంతర్గతంగా విచారణ జరిపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్‌ మాత్రం విఫలమయ్యాడు. రెండో వన్డే జులై 16న కార్డిఫ్‌ వేదికగా జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement