ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.
దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.
అర్జెంటీనా అదరహో
ఈ సమయంలో అర్జెంటీనా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. 85 నిమిషంలో మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం అదనపు సమయం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.
మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్ డిఫెన్స్‌ను తప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్‌ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లండ్ మరో గోల్ సాధించకపోవడంతో మెస్సీ సేన వరుసగా రెండో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది.


