IND vs ENG: అతడు గొప్పగా ఏమీ బౌలింగ్‌ చేయలేదు.. కానీ | I wont say they were exceptional balls: Abhishek Nayar on Gurnoor Brar | Sakshi
Sakshi News home page

IND vs ENG: అతడు గొప్పగా ఏమీ బౌలింగ్‌ చేయలేదు.. కానీ

Jul 16 2026 1:59 PM | Updated on Jul 16 2026 2:09 PM

I wont say they were exceptional balls: Abhishek Nayar on Gurnoor Brar

గుర్నూర్‌ బ్రార్‌ (PC: BCCI X)

గుర్నూర్‌ బ్రార్‌పై ప్రశంసలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గెలుపొందిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరుజట్ల మధ్య గురువారం నాటి రెండో వన్డేకు కార్డిఫ్‌ వేదికకాగా.. ఇక్కడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియా సీమ్‌ విభాగం గురించి.. ముఖ్యంగా గుర్నూర్‌ బ్రార్‌ గురించి భారత మాజీ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ గేమ్‌ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘గుర్నూర్‌ బ్రార్‌ తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు.

డకెట్‌ అవుట్‌ కాకపోయి ఉంటే..
నిజానికి తను మొదటి ఓవర్లో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శిస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా బెన్‌ డకెట్‌ క్రీజులోకి పాతుకుపోయినపుడు.. గుర్నూర్‌ తన మొమెంటమ్‌ను మార్చి ఎట్టకేలకు వికెట్‌ పడగొట్టాడు.

ఒకవేళ గుర్నూర్‌ గనుక డకెట్‌ను అవుట్‌ చేయకపోయినా.. అతడు ఇంకో నాలుగు నుంచి ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. మ్యాచ్‌ ఫలితం కచ్చితంగా వేరుగానే ఉండేది. డకెట్‌తో పాటు మరో ఓపెనర్‌, డేంజరస్‌ బ్యాటర్‌ జేకబ్‌ బెతెల్‌ను అవుట్‌ చేసి గుర్నూర్‌ మంచి బ్రేక్‌ ఇచ్చాడు.

గొప్పగా ఏమీ బౌలింగ్‌ చేయలేదు..కానీ
అయితే, ఈ రెండు వికెట్ల కోసం గుర్నూర్‌ అంత గొప్పగా ఏమీ బౌలింగ్‌ చేయలేదు. అయితే, ఆ సమయంలో అతడు చూపిన ఆత్మవిశ్వాసం గొప్పది. ఎలాగైనా వికెట్‌ తీయాలనే కసి మీద ఉన్నాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టి అనుకున్నది సాధించాడు’’ అని అభిషేక్‌ నాయర్‌ ప్రశంసించాడు.

ప్రసిద్‌ కూడా సూపర్‌
కాగా ఈ మ్యాచ్‌లో రైటార్మ్‌ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ తొమ్మిది ఓవర్లు బౌలింగ్‌ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. ఇక ప్రసిద్‌ కృష్ణ గురించి అభిషేక్‌ నాయర్‌ ప్రస్తావిస్తూ.. ‘‘వన్డే ఫార్మాట్లో అతడొక అసాధారణమైన బౌలర్‌. అఫ్గనిస్తాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీదా రాణించాడు’’ అని కొనియాడాడు.

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ప్రసిద్‌ 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 50 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 258 పరుగులకు కట్టడి చేసిన భారత్‌.. 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్‌ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. అంతకుముందు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.

చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement