ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా టీమిండియా స్పిన్‌ దిగ్గజం? | R Ashwin Breaks Silence On CSK Or England Head Coach Speculation, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కోచ్‌గా టీమిండియా స్పిన్‌ దిగ్గజం?

Jul 16 2026 10:06 AM | Updated on Jul 16 2026 11:24 AM

R Ashwin Breaks Silence On Becoming CSK Or England Head Coach

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇటీవలే తమ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ను పదవి నుంచి తొలగించింది. మెకల్లమ్‌ నేతృత్వంలో.. బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్సీలో ‘బజ్‌బాల్‌’ అంటూ సంప్రదాయ క్రికెట్‌లో దూకుడు ప్రదర్శించింది ఇంగ్లండ్‌.

తొలుత కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా.. ఆ తర్వాత జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. మెకల్లమ్‌ కూడా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ద్రవిడ్‌తో పాటు అశూ పేరు తెరమీదకు
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కొత్త హెడ్‌కోచ్‌ రేసులో టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా అనూహ్య రీతిలో భారత స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేరు కూడా తెరమీదకు వచ్చింది.

చర్చలు జరుగుతున్నాయి
ఈ విషయం గురించి ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ఒకరు అశూ వద్ద నేరుగానే ప్రస్తావించారు. అశూ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ కోచ్‌గా వెళ్లబోతున్నారా? అని ప్రశ్నించారు. ఇందుకు అశ్విన్‌ సూటిగా సమాధానం చెప్పకుండా.. ‘‘ఈసీబీ సీఈవో రిచర్డ్‌ గుడ్‌తో చర్చలు జరుగుతున్నాయి’’ అంటూ సరదాగా.. కాస్త వ్యంగ్యంగా బదులిచ్చాడు.

ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇటీవలే తమ హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో బంధం తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్‌ స్థానంలో కొత్త కోచ్‌గా ఎవరు వస్తారన్న చర్చల నడుమ.. ఇటు రాహుల్‌ ద్రవిడ్‌.. అటు అశ్విన్‌ పేర్లు తెరమీదకు వచ్చాయి.

సమాధానం చెప్పవచ్చు కదా!
ఈ విషయం గురించి కూడా సదరు జర్నలిస్టు అశ్విన్‌ దగ్గర ప్రస్తావించగా.. ‘‘మీరు నా యూట్యూబ్‌ చానెల్‌లో అశూ కి బాత్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ సమాధానం దాటవేశాడు. 

ఈ నేపథ్యంలో మొత్తానికి అశ్విన్‌ ఏదో దాస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు.. ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా కాకపోయినా.. చెన్నై కోచ్‌గా మాత్రం అశూ వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాగా సీఎస్‌కేతో అశూకు సుదీర్ఘ అనుబంధం ఉంది. చెన్నై తరఫున 2009లో అశూ అరంగేట్రం చేశాడు. అంతేకాదు 2010, 2011 సీజన్లలో సీఎస్‌కే చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు ఎడిషన్లలో 28 ఇన్నింగ్స్‌లో కలిపి 33 వికెట్లు కూల్చాడు. 

ఆ తర్వాత వేర్వేరు జట్లకు ఆడిన అశ్విన్‌.. గతేడాది తిరిగి చెన్నై జట్టుతో చేరాడు. కానీ ఆశించిన మేర రాణించలేక చతికిల పడ్డ అశూ.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 187 వికెట్లు తీసిన అశ్విన్‌.. ఇందులో సీఎస్‌కే తరఫున 127 వికెట్లు కూల్చాడు. 

చదవండి: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వైభవ్‌ రికార్డు బ్రేక్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement