PC: the_cau_official Instagram
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.
మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.
గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు.
ఆధిక్యంలోకి భారత్
ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.
లక్ష్య డబుల్ సెంచరీతో
కాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్‌సింఘే బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్‌వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు.
గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.
చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు


