లంక కెప్టెన్ విమత్- భారత జట్టు సారథి యశ్‌వర్దన్ (PC: SLC/X)
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్ అండర్ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.
కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగి.. మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్ సిగెర (0) విఫలమైనా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.
మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.
ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.
అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ అండర్-19 జట్టు 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది.


