టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే, ఇంగ్లండ్‌తో మూడో వన్డే అనంతరం ఆయన భారత జట్టుకు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.
క్రిక్‌బజ్ అందించిన సమాచారం ప్రకారం, డష్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్‌లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ అయిన డష్కటే రెండేళ్ల క్రితం భారత జట్టు సహాయ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముస్తుంది. అందుకే ఇంగ్లండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ అంగీకరిస్తాడా..?
డష్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత, వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో, డష్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది.
మరోపక్క ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాంలో నియమితులైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగనున్నారని సమాచారం.


