వరల్డ్‌కప్‌ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్‌ | Gill All But Confirms Kohli WC Participation Says This About Rohit Sharma | Sakshi
Sakshi News home page

IND vs ENG: వరల్డ్‌కప్‌ ప్రణాళికలు వేరు.. కోహ్లి భాయ్‌, రోహిత్‌ భాయ్‌ ఉంటే..

Jul 14 2026 1:11 PM | Updated on Jul 14 2026 1:48 PM

Gill All But Confirms Kohli WC Participation Says This About Rohit Sharma

PC: BCCI X

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌తో భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.

ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.

కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్‌ భాయ్‌, రోహిత్‌ భాయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.

గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్‌ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.

ఇక్కడి వికెట్ల మాదిరే 
వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్‌కప్‌ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్‌లు.. ఇక్కడి (ఇంగ్లండ్‌) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్‌గా మారింది.

 కొత్త వాళ్లకు అవకాశం 
నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్‌ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్‌మన్‌ గిల్‌ తెలిపాడు.

ఇక టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 4-0తో వైట్‌వాష్‌ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్‌పై గత టీ20 సిరీస్‌ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్‌ అన్నాడు.

చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్‌ యాదవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement