చెన్నై చిదంబరం స్టేడియం
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించి తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 2026-27 పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. బిగ్ బాష్ లీగ్ 16వ సీజన్ తొలి మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి.
భారత్‌లో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్ నిర్వహించడం ద్వారా రెండు దేశాల మధ్య క్రీడా సహకారం మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ చారిత్రక మ్యాచ్‌ను గత వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
చెన్నైలో ప్రారంభ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో సాధారణ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
గ్రూప్ దశలో 44 మ్యాచ్‌లు సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 12న మొదలుకానున్న బిగ్‌బాష్ లీగ్‌లో జనవరి 17 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 19న తొలి క్వాలిఫయర్, 20న నాకౌట్, 23న చాలెంజర్, 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
నాలుగేళ్ల విరామం తర్వాత క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24) రోజున మరో ప్రత్యేక మ్యాచ్ నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ వేదికగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్, హోబార్ట్ హరికేన్స్ జట్లు పోటీపడనున్నాయి. ఈ సీజన్‌లో ‘డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్’ అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం ఒక ఆటగాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయవచ్చు. మరో ఆటగాడు కేవలం ఫీల్డింగ్ లేదా వికెట్ కీపింగ్ మాత్రమే చేయవచ్చు. దీంతో జట్ల వ్యూహాల్లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Summer plans sorted! Your #BBL16 schedule has landed 🗓️ pic.twitter.com/AGSVp8OgVL
— KFC Big Bash League (@BBL) July 14, 2026


