నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌ | 1st Youth ODI: India Beat Sri Lanka By 4 Wickets In Last Over Thriller | Sakshi
Sakshi News home page

ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ.. శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌

Jul 4 2026 5:52 PM | Updated on Jul 4 2026 6:33 PM

1st Youth ODI: India Beat Sri Lanka By 4 Wickets In Last Over Thriller

PC: Sri Lanka Cricket

శ్రీలంక అండర్‌-19 జట్టుతో తొలి యూత్‌ వన్డేలో భారత్‌ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌టోటా వేదికగా భారత్‌- శ్రీలంక శనివారం తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి.

టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. ఓపెనర్‌ దిమంత మహావితన (42) రాణించగా.. కవిజ గమాగే (77) భారీ అర్ధ శతకంతో చెలరేగాడు.

ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడా 91 పరుగుల వద్ద అవుటై సెంచరీ చేజార్చుకున్నాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల (46 నాటౌట్‌) రాణించాడు. భారత బౌలర్లలో కావ్యా పటేల్‌ రెండు, మోహిత్‌ ఉల్వా, రోహిత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 321 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ 31 పరుగులు చేయగా.. సాగర్‌ విర్క్‌ హాఫ్‌ సెంచరీ (57)తో అలరించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని సైతం అర్ధ శతకం (52)తో మెరిశాడు.

ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ కుశాగ్రా ఓజా కేవలం 67 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 92 పరుగులు చేశాడు. కానీ సెత్మిక సెనెవిరత్నె బౌలింగ్‌ బౌల్డ్‌ కావడంతో శతకానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అన్వయ్‌ ద్రవిడ్‌ (రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు) 14, అర్జున్‌ రాజ్‌పుత్‌ 13 పరుగులే చేసి నిరాశపరిచారు.

అయితే ఆఖర్లో యశ్‌వీర్‌ గౌడ్‌, శవిన్‌ వినోద్‌ మెరుపులు మెరిపించారు. యశ్‌వీర్‌ 21 బంతుల్లో 33, వినోద్‌ 8 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 49 ఓవర్లలో స్కోర్లు సమం (320) అయ్యాయి. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొనగా.. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. అయితే, రెండో బంతిని వినోద్‌ ఫోర్‌గా మలచడంతో భారత్‌ విజయం ఖరారైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement