ముంబై: 2021 నాటి పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో తన అనుభవాలను వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూనే, దాదాపు రెండు నెలల పాటు జైలులో గడిపిన భయానక పరిస్థితులపై ఆయన మాట్లాడారు.
ఇటీవల ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. విచారణ కోసమే పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు భావించానని, అయితే అక్కడికి వెళ్లాకే తన అరెస్టు వార్తను ఆన్‌లైన్‌లో చూసి తెలుసుకున్నానని చెప్పారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా, ఇది కోర్టు ఆదేశమని వారు తెలిపారని గుర్తుచేసుకున్నారు.
తన అరెస్టు విషయం శిల్పా శెట్టికి వార్తల ద్వారానే తెలిసిందని కుంద్రా పేర్కొన్నారు. ‘ఆమె న్యాయవాదులను సంప్రదించినప్పటికీ ఏమి చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. ఆ సమయంలో భారతదేశంలో మా వ్యాపారాల్లో దాదాపు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 'వీటన్నింటినీ నేనెలా నిర్వహించాలి?’ అని శిల్ప ఆందోళన చెందింది. 63 రోజుల పాటు జైలులో ఉండాల్సి వస్తుందని నాతో చెప్పారు కానీ, అసలు ఎంత సమయం పడుతుందో నాకప్పుడు తెలియదు’ అని ఆయన తెలిపారు.
జైలులోని వసతుల లేమిపై స్పందిస్తూ.. ‘50 మంది మాత్రమే పడుకోవడానికి సరిపోయే ఒక చిన్న గదిలో ఏకంగా 250 మందిని ఉంచారు. ఒకరిపై ఒకరు పడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కనీసం కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. అక్కడ ఆహారం కూడా అత్యంత దారుణంగా ఉండేది’ అని రాజ్ కుంద్రా వివరించారు.
ఇది కూడా చదవండి: ఫిట్‌నెస్ ఈవెంట్‌లో కుప్పకూలిన ప్రముఖ కోచ్


