PC: T20 Blast X
ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్-2026 లీగ్‌లో సోమర్‌సెట్ స్టార్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ అతడు విధ్వంసం సృష్టించడం విశేషం.
161 పరుగులు
లీడ్స్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో యార్క్‌షైర్‌తో సోమర్‌సెట్ తలపడింది. టాస్ గెలిచిన యార్క్‌షైర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. యార్క్‌షైర్ బ్యాటర్లలో ఓపెనర్ ఆడం లిత్ అర్ధ శతకం (64) సాధించగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగులు చేయలేకపోయారు.
సోమర్‌సెట్ బౌలర్లలో జేక్ బాల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. డానియెల్ సామ్స్, క్రెయిగ్ ఓవర్టన్, రిలే మెరెడిత్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సోమర్‌సెట్‌కు యార్క్‌షైర్ బౌలర్లు చుక్కలు చూపించారు.
టాప్, మిడిల్ ఆర్డర్ కుదేలు
ఓపెనర్లలో విల్ స్మీడ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. థామస్ రూ ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరి వికెట్లను జార్జ్ హిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ టామ్ బాంటన్ (1).. మిడిలార్డర్‌లో జేమ్స్ రూ (1), టామ్ కోలెర్‌కాడ్మోర్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.
మిగిలిన వారిలో లోయర్ ఆర్డర్‌లో లైయీస్ గోల్డ్స్‌వర్తి 19, కెప్టెన్ లూయీస్ గ్రెగరీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. డేనియల్ సామ్స్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో కేవలం 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సోమర్‌సెట్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది.
From the most unlikely of positions, Craig Overton has pulled off something SPECTACULAR and sent Somerset to Finals Day 😱 pic.twitter.com/EcYh6pgQT5
— Vitality T20 Blast (@VitalityBlast) July 15, 2026
కేవలం 30 బంతుల్లోనే
ఇలాంటి తరుణంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ అద్భుతం చేశాడు. కేవలం 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో ఏకంగా 79 పరుగులు రాబట్టాడు. అతడితో పాటు రిలే మెరెడిత్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఫలితంగా మరో బంతి మిగిలి ఉండగానే సోమర్‌సెట్ లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 162 పరుగులు సాధించింది. తద్వారా రెండు వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌ను ఓడించి.. సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్‌తో సోమర్‌సెట్ అమీతుమీ తేల్చుకుంటుంది.
క్రెయిగ్ ఓవర్టన్ ప్రపంచ రికార్డు
టీ20 క్రికెట్ చరిత్రలో తొమ్మిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా క్రెయిగ్ ఓవర్టన్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు జమ్మూ కశ్మీర్‌కు చెందిన సయ్యద్ సాగర్ పేరిట ఉండేది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2013లో భాగంగా హర్యానాతో మ్యాచ్‌లో సాగర్ తొమ్మిదో స్థానంలో వచ్చి 36 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కాగా క్రెయిగ్ ఓవర్టన్ మరెవరో కాదు ఇంగ్లండ్ స్టార్ జేమీ ఓవర్టన్‌కు స్వయానా సోదరుడు.


