అందుకే అద్భుత విజయం దక్కింది
భారత మహిళల జట్టు కోచ్ మజుందార్
లండన్: టి20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌పై ఏకైక టెస్టులో ఘన విజయంతో సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్ బృందానికి ఈ గెలుపు ఊరటనిచ్చింది. ఈ టెస్టులో మన జట్టుకు అన్ని అంశాలు కలిసొచ్చాయని జట్టు చీఫ్ కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. దూకుడు, ఓపిక కలగలిసిన ప్రదర్శనతో ఫలితం రాబట్టామని అతను అన్నాడు. ‘అందరూ చెబుతున్నట్లుగా ఈ టెస్టు మ్యాచ్‌లో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ఏదో ఒక్క అంశం గురించే ప్రత్యేకంగా చెప్పడం లేదు. ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెడుతూ అన్ని విధాలా క్రమశిక్షణను ప్రదర్శించాం.

బ్యాటింగ్, బౌలింగ్ బాగా చేయడమే కాదు ఫీల్డింగ్‌లో కూడా ఎంతో మెరుగయ్యాం. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం సానుకూల ఫలితం ఇచ్చింది. దూకుడుతో పాటు కాస్త ఓపికను కూడా చూపించాం. ఇవే విజయానికి కారణంగా నిలిచాయి. మాకు మొత్తంగా చాలా మంచి మ్యాచ్‌గా మిగిలిపోయింది’ అని మజుందార్ విశ్లేషించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తిక భాటియా, క్రాంతి గౌడ్‌లపై కోచ్ ప్రశంసలు కురిపించాడు. క్రాంతి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కుప్పకూల్చగా, యస్తిక సెంచరీతో చెలరేగింది.
‘యస్తిక ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకమైంది. అదీ లార్డ్స్ మైదానంలో రావడం దానిని చిరస్మరణీయంగా మార్చింది. గత రెండేళ్లుగా గాయాలతో బాధపడిన యస్తిక వాటి నుంచి కోలుకొని, ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఇప్పుడు ఇలాంటి బ్యాటింగ్ చేయడం నిజంగా అభినందించదగ్గ అంశం. ముఖ్యంగా ఆమె ఆడిన చక్కటి షాట్లు చూసేవారికి కనువిందు చేశాయి. క్రాంతి బంతిపై నియంత్రణ చూపిన తీరు అద్భుతం. సరైన చోట ఆమె తాను అనుకున్నట్లుగా బంతులు వేయగలిగింది. గుడ్ లెంగ్త్‌లో బౌలింగ్‌తో వికెట్లు రాబట్టింది’ అని మజుందార్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ విషయంలో భారత జట్టు మొదటినుంచీ పటిష్టంగానే ఉందన్న కోచ్...యస్తిక కీపింగ్ ప్రదర్శనను కూడా కొనియాడాడు.


