భారత్‌తో వన్డేలు.. ఇంగ్లండ్‌ జట్టులో మరో ఫాస్ట్‌ బౌలర్‌ | England Makes Key Addition In ODI Squad Vs India | Sakshi
Sakshi News home page

భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు.. ఇంగ్లండ్‌ జట్టులో మరో ఫాస్ట్‌ బౌలర్‌

Jul 14 2026 6:49 PM | Updated on Jul 14 2026 7:43 PM

England Makes Key Addition In ODI Squad Vs India

భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్‌ బౌలర్ బ్రైడన్ కార్స్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్‌లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.

ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్‌ను జట్టులో చేర్చినట్లు సమాచారం.

భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.

కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్‌, లార్డ్స్‌ వేదికలుగా జరుగనున్నాయి.

ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్‌ (56), డాసన్‌ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. 

42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్‌ దూబే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement