నేడు రెండో సెమీఫైనల్లోడిఫెండింగ్ చాంపియన్‌తో ఇంగ్లండ్ ‘ఢీ’
అట్లాంటా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టుతో నేడు జరిగే పోరులో మాజీ విజేత ఇంగ్లండ్ తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా జట్టు సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు విజయం సాధించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు 60 ఏళ్ల క్రితం ఒకే ఒక్కసారి ఫైనల్ చేరుకొని ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 1966 తర్వాత ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్‌కు రెండుసార్లు అవకాశం వచ్చింది. కానీ ఆ రెండుసార్లు (1990, 2018) ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే వెనుదిరిగింది.
ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఇంగ్లండ్‌కు మరో చాన్స్ వచ్చింది. ఇంగ్లండ్, అర్జెంటీనా జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నెగ్గింది. 5 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 5 సార్లు పోటీపడ్డాయి. 3 సార్లు ఇంగ్లండ్... 2 సార్లు అర్జెంటీనా నెగ్గాయి. 2002 ప్రపంచకప్ తర్వాత మళ్లీ అర్జెంటీనాతో ఇంగ్లండ్ ‘ఢీ’కొంటోంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ 8 గోల్స్ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ 6 గోల్స్ చొప్పున సాధించి జోరుమీదున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడని అర్జెంటీనాకు ఇంగ్లండ్ షాక్ ఇస్తుందా... లేక నాలుగోసారి సెమీస్‌లో నిష్క్రమిస్తుందా వేచి చూడాలి.


