నేడే ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ పోరు
డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ ‘ఢీ’
మెస్సీ బృందంపై భారీ అంచనాలు
తగ్గేదేలే అంటున్న యూరోపియన్ చాంపియన్
అర్ధరాత్రి గం. 12:30 నుంచి యునైట్ 8 స్పోర్ట్స్ చానెల్స్, జీ5 యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
39 రోజులు, 103 మ్యాచ్‌ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్‌ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్‌తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది.
న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.
2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది.
ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్‌లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
చివర్లో చెలరేగుతూ...
ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్‌లో 12 గోల్స్ మ్యాచ్‌లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు.
మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై
ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్‌లు కొట్టడం గమనార్హం.
విజేత జట్టుకు రూ. 481 కోట్లు
ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి.
5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి.
37 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.
3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి.
1 ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్‌కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి.
4 ఫైనల్లో స్పెయిన్‌పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.
3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.
1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలిచింది.


