ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మయామి వేదికగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ 'బ్రాంజ్ ఫైనల్' పోరు ఫస్ట్ హాఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాలకే కెప్టెన్ డెక్లాన్ రైస్ ఒక అద్భుతమైన లాంగ్-రేంజ్ గోల్‌తో ఖాతా తెరిచాడు.
ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం బుకాయో సాకా వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్‌ను 4-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలి ఆర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో ఇంగ్లండ్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.
కానీ సెకెండ్ హాఫ్‌లో మాత్రం ఫ్రాన్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. కెప్టెన్ ఎంబాపే 48వ నిమిషంలో ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. వెంటనే 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో ఎంబాపే మరో గోల్ కొట్టడంతో స్కోరు 4-3కి చేరింది. దీంతో ఇంగ్లండ్ డౌగౌట్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావారణం నెలకొంది.
అయితే ఫ్రాన్స్ జట్టు మ్యాచ్‌ను సమం చేసేలా కనిపించిన సమయంలో, ఇంగ్లండ్ స్టార్ బుకాయో సాకా మరోసారి సత్తాచాటాడు. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి తన హాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ గోల్‌తో ఇంగ్లండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఫ్రాన్స్ మళ్లీ గోల్ సాధించి పోటీలో నిలిచింది.
కానీ మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్ కొట్టి తన జట్టు విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 1966 తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఓ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.


