దొంగాట కూడా... మెరుపుల మధ్య మరకలు | From Refereeing Calls To Suspensions, FIFA World Cup 2026 Controversies, Refereeing Decisions And Governance Under Scrutiny | Sakshi
Sakshi News home page

దొంగాట కూడా... మెరుపుల మధ్య మరకలు

Jul 19 2026 1:10 AM | Updated on Jul 19 2026 11:21 AM

Many controversies in the Football World Cup

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో వివాదాలు కొత్త కాదు. ప్రతీసారి ఈ మెగా ఈవెంట్‌లో ఎన్నో అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. ఆటగాళ్ల ప్రవర్తను సంబంధించి కొన్ని వివాదాలు ఉంటే, మరికొన్ని రిఫరీల నిర్ణయాలు, వారి వ్యవహార శైలిపై సందేహాలు రేకెత్తిస్తాయి. ఇప్పుడు కూడా పలు ఘటనలు ప్రపంచకప్‌ నిర్వహణలో పారదర్శకత లేకుండా ‘ఫిఫా’ నిజాయితీని శంకించేలా కనిపించాయి.  

రొనాల్డోకు ప్రపంచకప్‌ అవకాశం... 
వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు దారాషియాను దురుసుగా అడ్డుకున్నందుకు పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీని ప్రకారం అతడు చివరి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌తో పాటు వరల్డ్‌ కప్‌ తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాలి. అయితే రొనాల్డో స్థాయి, అతని స్టార్‌ హోదాను దృష్టిలో ఉంచుకొని ‘ఫిఫా’ సడలింపు ఇచ్చింది. 226 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్‌లో అతను ఇలా ఎప్పుడూ చేయలేదు కాబట్టి నిషేధాన్ని ‘ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు’ ప్రకటించింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. రొనాల్డో రెండు మ్యాచ్‌లు ఆడకపోతే ఆ మ్యాచ్‌లపై ఆసక్తి తగ్గిపోతుందనే ‘ఫిఫా’ ఈ నిర్ణయం తీసుకుంది.  

బాలోగాన్‌ కోసం ట్రంప్‌ సిఫారసు... 
అమెరికా ఆటగాడు ఫొలారిన్‌ బాలోగాన్‌ విషయంలో ‘ఫిఫా’ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు బాలోగన్‌ రెడ్‌ కార్డుకు గురయ్యాడు. దాంతో బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్‌ పోరులో అతను ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆతిథ్య జట్టు ఆటగాడు అలా తప్పుకోవడం బాగుండదని, ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్‌ఫాంటినోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నేరుగా ఫోన్‌ చేసి అడిగాడు. దాంతో ఇన్‌ఫాంటినో వెంటనే స్పందించిన బాలోగాన్‌ నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. మైదానంలో ఆటపై బయటి వ్యక్తి ఇలా కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. తగిన సమాధానం ఇవ్వకుండా ‘ఫిఫా’ తమ నిర్ణయాన్ని అమలు చేసింది.

టోర్నీ ‘డ్రా’తోనే పక్షపాతం... 
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్నిస్‌ పద్ధతిలో ‘ఫిఫా’ తెలివిగా మ్యాచ్‌ల ‘డ్రా’ను ప్రకటించింది. గతంలో ఓపెన్‌ ‘డ్రా’ ద్వారా చూస్తే నాకౌట్‌ దశకు ముందే పెద్ద జట్లు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం వచ్చేది. ఈసారి ఎంచుకున్న ‘డ్రా’ ప్రకారం ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న స్పెయిన్‌...నంబర్‌ టూ అర్జెంటీనాను ఫైనల్‌ వరకు ఎదుర్కొనే అవకాశమే లేదు. మూడో స్థానంలోని ఫ్రాన్స్, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ మధ్య సెమీస్‌కు ముందు మ్యాచ్‌ జరగదు. ‘ఫిఫా’ తెలివితేటలు బాగా పని చేశాయని చివరకు తేలింది. చరిత్రలో తొలిసారి టాప్‌–4 టీమ్‌లు వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.  

సోమాలియా రిఫరీకి నో ఎంట్రీ... 
ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ రిఫరీల్లో ఒకడిగా సోమాలియాకు చెందిన ఒమర్‌ అబ్దుల్‌ కదిర్‌కు పేరు ఉంది. అందుకే అతడిని ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ రిఫరీల జాబితాలో చేర్చింది. అయితే తమ దేశంలోకి ప్రవేశించించేందుకు నిషేధం ఉన్న దేశాల్లో సోమాలియా ఒకటి. కాబట్టి కదిర్‌ను అమెరికాలో అడుగుపెట్టనిచ్చేది లేదని వైట్‌హౌస్‌ అధికారులు స్పష్టం చేశారు. 

అతడికి వీసా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా కాకుండా అధికారిక హోదాలో వరల్డ్‌ కప్‌ కోసం అతను వచ్చినా సరే అమెరికా ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇలాంటి స్థితిలో రిఫరీకి కనీసం అండగా నిలవకుండా మౌనం వహించడం ‘ఫిఫా’ అమెరికాకు ఎంతగా తలవంచిందో అర్థమవుతుందని విమర్శలు వెలువెత్తాయి.  

అర్జెంటీనా... ‘ఫిఫా’ భాయ్‌ భాయ్‌
‘ఫిఫా’ ఎలాగైనా అర్జెంటీనా జట్టును మళ్లీ విజేతగా నిలపాలని చూస్తున్నట్లుంది... ఆ జట్టుకు మా ముందస్తు అభినందనలు... ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ తర్వాత ఈజిప్ట్‌ ఆటగాళ్ల స్పందన ఇది. ప్రతీ మ్యాచ్‌లో రిఫరీలు ఆ జట్టుకు మద్దతుగా నిలిచారని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. వరుసగా ఈజిప్ట్ , స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో అర్జెంటీనాకు అనుకూలంగా అంతా జరిగిందని ప్రపంచం మొత్తం విమర్శించింది. వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌) ద్వారా అయితే అర్జెంటీనాకే పూర్తిగా అండగా నిలవడం కనిపించింది. కనీసం దాపరికం కూడా లేకుండా బహిరంగంగా ‘ఫిఫా’ అన్ని పరిమితులు దాటేసిందని ఇతర జట్ల అభిమానులు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. 

ఈ ఘటనలన్నీ అర్జెంటీనా విజయాల స్థాయిని తగ్గించాయి అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కాలు తగిలి ప్రత్యర్థి కెప్టెన్ ఐసా మందీ కింద పడ్డాడు. రీప్లేలో కూడా ఇది కనిపించింది. రెడ్‌ కార్డ్‌ స్థాయి శిక్షకు గురయ్యే ఈ ఘటనలో మెస్సీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అర్జెంటీనాతో జరిగిన  మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ ఆటగాడు బ్రీల్‌ ఎంబోలో తప్పు లేదని కనిపిస్తున్నా అంపైర్‌ ఎల్లో కార్డ్‌ ఇచ్చాడు. మ్యాచ్‌లో అది అతడికి రెండో ఎల్లో కార్డ్‌ కావడంతో బ్రీల్‌ ఎంబోలో మైదానం వీడగా... అప్పటి వరకు 1–1తో మెరుగైన స్థితిలో కనిపించిన స్విట్జర్లాండ్‌ 10 మందితోనే ఆడి ఓటమి పాలైంది.  

ఈజిప్ట్  తో జరిగిన మ్యాచ్‌లోనైతే రిఫరీ మరీ పక్షపాతంగా వ్యవహరించినట్లు తేలింది. 58వ నిమిషంలో ఈజిప్ట్‌ ప్లేయర్‌ ముస్తఫా జికో చేసిన గోల్‌ను రిఫరీ ‘ఫౌల్‌’గా తేల్చడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అదే మ్యాచ్‌ చివర్లో సలా తప్పు లేదని తేలినా... అర్జెంటీనాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ఓటమి ఖాయమనిపించిన స్థితిలో 14 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్‌ చేసి అర్జెంటీనా మ్యాచ్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా గోల్‌ కొట్టడంలో విఫలమైనప్పుడు బాధపడుతూ, గోల్‌ కొట్టగానే సంబరాలు చేసుకుంటున్న ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్‌ఫాంటినో దృశ్యాలు ప్రపంచం అవాక్కయ్యేలా చేశాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌ చేసిన గోల్‌ చర్చకు దారి తీసింది. అది ‘ఆఫ్‌సైడ్‌’ గోల్‌ అయినా... పూర్తిగా రివ్యూ చేయకుండా, అసలు వీఏఆర్‌లో ఆఫ్‌సైడ్‌ గ్రాఫిక్స్‌ కూడా చూడకుండా రిఫరీ తన నిర్ణయం ప్రకటించాడని అంతా ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement