అక్కడే మేం గెలిచాం.. ఆసీస్‌ సిరీస్‌పై బంగ్లా కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Australia naming full strength squad achievement for Bangladesh: Najmul Hossain | Sakshi
Sakshi News home page

అక్కడే మేం గెలిచాం.. ఆసీస్‌ సిరీస్‌పై బంగ్లా కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jul 25 2026 12:18 PM | Updated on Jul 25 2026 12:18 PM

Australia naming full strength squad achievement for Bangladesh: Najmul Hossain

source: Sportzwiki

ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు.

"గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్‌స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

అయితే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్‌కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్‌ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్‌స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.

మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.

తొలి టెస్ట్‌ డార్విన్‌ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఓ మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ ఆగస్టు 6-8 వరకు  డార్విన్‌ వేదికగా జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement