Photo Credit: Cricket Australia
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు సీనియర్లు జోష్ హాజిల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనుండగా, 2025-26 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ నెసర్‌ను తుది జట్టు నుంచి తప్పించారు.
ఆగస్టు 13 నుంచి 17 వరకు డార్విన్ వేదికగా తొలి టెస్టు, మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి 26 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. 13 మందితో కూడిన జట్టులో ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్ ఉన్నారు.ఇక గతేడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు అనంతరం వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఇక కండరాల గాయంతో జోష్ హాజిల్‌వుడ్ కూడా యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియోన్ మరోసారి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కమిన్స్ గైర్హాజరీలోనూ గతేడాది సొంతగడ్డపై యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో నెగ్గింది. ఈ సిరీస్‌లో మైకెల్ నెసర్ రాణించాడు.
మూడు మ్యాచ్‌లు కలిపి 15 వికెట్లు తీయడమే గాక, చివరి రెండు టెస్టుల్లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయితే కమిన్స్, హాజిల్‌వుడ్ జట్టులోకి రావడంతో నెసర్‌ను జట్టు తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2027 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా వచ్చే సీజన్ (2027-2029) సైకిల్లోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. తర్వాతి 12 నెలల్లో ఆస్ట్రేలియా మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్
Read: దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్స్.. తస్మాత్ జాగ్రత్త!


