photo credit: newsbytes
ఆఫ్ఘనిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ప్రకటించింది. అయితే షాహిదీ ఆటగాడిగా మాత్రం వన్డే జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.
2021లో వన్డే జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన షాహిదీ ఆఫ్ఘనిస్తాన్‌కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. అతడి నాయకత్వంలో ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రగతి సాధించింది. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి అగ్ర జట్లపై చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
అనంతరం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విశేషంగా రాణించింది. షాహిదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతడు ఆటగాడిగా జట్టుకు సేవలు కొనసాగిస్తాడని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొత్త వన్డే కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది.
ఇటీవల టెస్టు జట్టుకు రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించిన ఆఫ్ఘనిస్తాన్ బోర్డు, ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త నాయకుడిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.


