Photo Credit: Hundred Twitter
ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏకకాలంలో ప్రారంభమైన హండ్రెడ్ మెన్స్, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మహిళల విభాగంలో ముంబై ఇండియన్స్ లండన్‌పై సన్‌రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఏకకాలంలో రెండు జట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజయాలు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
దంచికొట్టిన పూరన్..
పురుషుల హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 4 వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ (39 బంతుల్లో 60 నాటౌట్), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.
రాణించిన దీప్తి శర్మ
మహిళల హండ్రెడ్ టోర్నీ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) పర్వాలేదనిపించారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, డానియెల్లి గిబ్సన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫోబె లిచ్‌ఫీల్డ్ (3), అనాబెల్ సదర్లాండ్ (30) విజయంలో కీలకపాత్ర పోషించారు.


