Photo Credit: BCCI Twitter
దేశవాళీ సీజన్‌కు (2026-27) ముందు బీసీసీఐ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించిన చట్టాలను ఐసీసీ అమలు పరచనున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు సమానంగా బీసీసీఐ కూడా దేశవాళీ టోర్నీల్లో ఆయా చట్టాలను అమలు చేయాలని భావించింది.
ఈ నేపథ్యంలోనే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు అన్ని దేశీయ టోర్నీల్లో అంతర్జాతీయంగా ఉన్న రూల్స్ అన్ని అమల్లోకి రానున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో మరింత పారదర్శకత, న్యాయంతో కూడిన క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలను తీసుకొచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.
చివరి ఓవర్ పూర్తి చేయాల్సిందే
ఇకపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రోజులో చివరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటి వరకు చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడితే అంపైర్లు ఆ రోజు ఆటను ముగించే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధన ప్రకారం వికెట్ పడినా మిగిలిన బంతులన్నీ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. దీంతో కొత్త బ్యాటర్ కూడా మిగిలిన బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త బ్యాటర్‌ను పంపకుండా సమయం వృథా చేసే అవకాశాన్ని నివారించడానికే ఈ మార్పు తీసుకొచ్చారు.
ఉద్దేశపూర్వక నోబాల్ వేస్తే కఠిన చర్యలు
కొత్త నిబంధనల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేస్తే బౌలర్లపై కఠినచర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ ఫుట్ నోబాల్ లేదా పిచ్‌పై పడకుండా డెలివరీ వేస్తే, అతడు ఆ ఇన్నింగ్స్‌కే కాదు, మొత్తం మ్యాచ్‌లోనే బౌలింగ్ చేసే హక్కును కోల్పోతాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది అంపైర్లే నిర్ణయిస్తారు.
ఫీల్డర్ ముందే బంతిని అడ్డుకుంటే?
బ్యాటింగ్ సమయంలో స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ వద్దకు చేరకముందే ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే, దానిని నోబాల్‌తో పాటు డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. అలాగే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో జట్లు ‘డిక్లరేషన్’ లేదా ‘ఫోర్‌ఫిట్’ చేసే అవకాశాన్ని కూడా తొలగించారు.
కోచ్‌లకు అనుమతి..
వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో నేరుగా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వనున్నారు.దీంతో మ్యాచ్ మధ్యలోనే వ్యూహాలను మరింత సమర్థంగా చర్చించే అవకాశం జట్లకు లభించనుంది.
షార్ట్ రన్‌పై స్పష్టత
బ్యాటర్లు ప్రత్యర్థిని మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా పరుగు మధ్యలో తిరిగి వెనక్కి వస్తే, దానిని డెలిబరేట్ షార్ట్ రన్‌గా పరిగణించరు. కానీ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసుకుంటే, తదుపరి బంతిని ఏ బ్యాటర్ ఎదుర్కోవాలో నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు ఉండేలా నిబంధన తీసుకొచ్చారు.
డెడ్ బాల్ రూల్‌లో మార్పు
ఇప్పటి వరకు బంతి బౌలర్ లేదా వికెట్‌కీపర్ చేతిలోకి వచ్చిన తర్వాతే సాధారణంగా డెడ్ బాల్‌గా పరిగణించేవారు. ఇకపై బంతి ఏ ఫీల్డర్ చేతిలో స్థిరంగా ఉన్నా లేదా మైదానంలో పూర్తిగా నిలిచిపోయినా దానిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.
👉వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో లెగ్‌సైడ్ వైడ్ విషయంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బంతి విసిరే సమయంలో ఫీల్డర్లందరూ తప్పనిసరిగా బౌండరీ లైన్ లోపలే ఉండాలి. దీంతో బౌండరీ బయట నిలబడి ప్రయోజనం పొందే అవకాశానికి చెక్ పడుతుంది. అలాగే వికెట్‌కీపర్ బంతి డెలివరీ సమయంలో తప్పనిసరిగా వికెట్ వెనుకనే ఉండాలి.
👉మ్యాచ్‌లో ఎవరైనా అక్రమ పరికరాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తిస్తే, అంపైర్లు వాటి వినియోగాన్ని వెంటనే నిలిపివేసి సంబంధిత అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధనలను 2026-27 దేశీయ సీజన్ నుంచే అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.


