గత కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి శాంతి, సంభాషణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చాడు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ.."ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలి. వారి సంక్షేమమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. సంభాషణ ద్వారానే దేశ భవిష్యత్తు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.
Yuvraj Singh Instagram Story. pic.twitter.com/ufb1k3JVBX
— Jotdofficial (@jotdofficial_) July 22, 2026
విద్యార్థుల నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన ఏ రాజకీయ పక్షానికీ మద్దతు ప్రకటించకుండా, విద్యార్థుల భద్రత, సంక్షేమం, విద్యా భవిష్యత్తుపైనే తన సందేశాన్ని కేంద్రీకరించాడు.
క్యాన్సర్‌ను జయించిన తర్వాత యువరాజ్ స్థాపించిన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన, చికిత్స సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటి లోకం స్పందించడం మొదలు పెట్టింది. తొలుత ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యువరాజ్ సింగ్ చేరాడు.
కాక్రోచ్‌ల నిరసనలపై క్రికెట్ రంగానికి సంబంధించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నెటిజన్లు మరో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికి పోతుంటే విరాట్ మాత్రం స్వామీజీల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.
దేశ యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తిగా విరాట్‌ను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాడు యువతకు ఏరకంగా ఆదర్శంగా నిలుస్తాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరు విరాట్ తన మఖాంను యూకే మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని దేశం నుంచే బహిష్కరించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
దేశం పట్ల, దేశ యువత పట్ల ఏమాత్రం బాధ్యలేకుండా ఇక్కడ సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడే వారికి కూడా యువత సరైన గుణపాఠం నేర్పాలని పిలుపునిస్తున్నారు.


