నేడు తొలి టి20
శ్రేయస్ సారథ్యంలో బోణీ కోసం నిరీక్షణ
సా. గం. 4:30 నుంచి యునైట్8 స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రసారం
హరారే: ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత క్రికెట్ జట్టు... మరో టి20 పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జింబాబ్వేతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ భారత టి20 జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయిన టీమిండియా... ఈ సిరీస్‌లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తుందో చూడాలి. సంజూ సామ్సన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మతో కలిసి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో దంచి కొట్టిన వైభవ్... జింబాబ్వేతో సిరీస్‌లో అయినా చెలరేగుతాడా చూడాలి. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే మైదానంలో భారీ సెంచరీ బాదిన వైభవ్ సీనియర్ స్థాయిలో రాణించాల్సిన అవసరముంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబేతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. అయితే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంది.
బౌలింగ్‌లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా... ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కీలకం కానున్నారు. పేస్ ఆల్‌రౌండర్ సూర్యాషే షెడ్గే కంటే... స్పిన్నర్ హర్ష్ దూబేకే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. గత జింబాబ్వే పర్యటనలో శతకంతో సత్తా చాటిన అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. గౌతమ్ గంభీర్ స్థానంలో ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
మరోవైపు సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే జట్టులో బెనెట్, మరుమని, మధెవెరె, బర్ల్, ఇవాన్స్, మసకద్జ రూపంలో నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో ఐపీఎల్ అనుభవం ఉన్న బ్లెస్సింగ్ ముజరబానితో భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ముప్పు పొంచి ఉంది. పిచ్ పేసర్లకు సహకరించనుంది. కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.


