వైస్ కెప్టెన్ తిలక్ వర్మ
రేపు జింబాబ్వేతో భారత్ తొలి టి20
హరారే: ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల చేతుల్లో టి20 సిరీస్‌లు ఓడిపోయిన తర్వాత భారత జట్టు ఇప్పుడు ఈ ఫార్మాట్‌తో మరో పోరుకు సిద్ధమైంది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా రేపు భారత్, జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
అయితే ఇటీవల ప్రదర్శనను మరచి కొత్త ఉత్సాహంతో తాము బరిలోకి దిగుతున్నామని భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. ‘జింబాబ్వే చాలా మంచి జట్టు. ఎంతో పోటీతత్వంతో పోరాడుతుంది. వారిని ఓడించడం అంత సులువు కాదు.
గత ఏడాది జింబాబ్వేతో ఆడిన సిరీస్‌లో తొలి మ్యాచ్ వారే నెగ్గారు. నాటి భారత టీమ్‌లో ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడూ వచ్చారు. మంచి పిచ్‌లతో బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
గతంలో జింబాబ్వే గడ్డపై ఆడిన అనుభవం పనికొస్తుంది’ అని తిలక్ అన్నాడు. ఐర్లాండ్–ఇంగ్లండ్‌ల చేతుల్లో ఓటమికి పలు కారణాలు ఉన్నాయని, వాటిని విశ్లేషించుకున్నామని.. తాను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉందని చెప్పాడు.


