source: cricket australia x
భారత సంతతికి చెందిన మరో ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియాలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీలో పుట్టిన నిఖిల్ చౌదరి ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ అనే ఇద్దరు కుర్రాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు.
ముంబైలో జన్మించిన జెర్సిస్ వాడియా దక్షిణ ఆస్ట్రేలియా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో అతడికి అవకాశం లభించింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున బ్రిస్బేన్ హీట్‌పై తొలి మూడు బంతులకే వరుసగా మూడు సిక్సర్లు బాది సంచలనంగా మారాడు.
మరోవైపు 18 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆర్యన్ శర్మను చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా డెవలప్‌మెంట్ స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు. కుడిచేతి బ్యాటర్, ఎడమచేతి స్పిన్ బౌలర్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు, మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
వలస కుటుంబంలో జన్మించిన ఆర్యన్ శర్మ చిన్నప్పటి నుంచే ఆస్ట్రేలియా తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే "18 ఏళ్లకు ఆస్ట్రేలియా జట్టుకు ఆడాలి" అని రాసుకున్న లక్ష్యాన్ని అండర్-19 జాతీయ జట్టులో చోటు దక్కించుకుని నిజం చేసుకున్నాడు.
వీరిద్దరి ఎంట్రీతో క్రికెట్ ఆస్ట్రేలియాలో భారత సంతతి ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. నిఖిల్ చౌదరికి ముందు గురిందర్ సంధు, తన్వీర్ సంఘా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ ఆసీస్ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఇంకా చాలామంది భారత సంతతి చెందిన క్రికెటర్లు ఆస్ట్రేలియాలో క్రికెట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.


