బాండీ బీచ్ మారణహోమం వేళ20 మందిని కాపాడిన రెహ్మత్ పాషాకుఅరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది.
వీలున్నంత వరకు సహకరించాలని...
బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్‌డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.
దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్‌లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు.


