పోలీసు రాజ్యం నడవదు | TPCC chief Mahesh Goud at the Chalo Lok Bhavan program | Sakshi
Sakshi News home page

పోలీసు రాజ్యం నడవదు

Jul 23 2026 3:55 AM | Updated on Jul 23 2026 3:55 AM

TPCC chief Mahesh Goud at the Chalo Lok Bhavan program

చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలుపుతున్న బల్మూరి, పొంగులేటి, మహేశ్‌గౌడ్, దానం నాగేందర్‌ తదితరులు

నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే 

‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌/నాంపల్లి: ప్రజాస్వామ్య భారత్‌లో పోలీసు రాజ్యం నడవదని, విద్యార్థులు, యువకుల ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆత్మఘోషకు కారణమైన నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతాన్ని ఈ దేశం మర్చిపోదని వ్యాఖ్యానించారు. నీట్‌ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు శాంతియుత ఆందోళన చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ‘చలో లోక్‌ భవన్‌’కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రం లీక్‌ చేసి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిన మోదీ ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేకుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న రాహుల్‌గాం«దీతోపాటు ఇతర విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం దారుణమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ ఉదంతంపై పార్లమెంటు సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు.  

సంకెళ్లు వేసుకుని నిరసన.. 
ఆందోళనలో భాగంగా మహేశ్‌గౌడ్, మంత్రి పొంగులేటి, విప్‌ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిణ్‌రెడ్డితోపాటు పలువురు కార్పొరేషన్‌ చైర్మన్లు చేతులకు సంకెళ్లు వేసుకుని ఇందిరమ్మ విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలియజేశారు. అనంతరం నెక్లెస్‌రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వద్దకు భారీస్థాయిలో చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి లోక్‌భవన్‌ వైపునకు దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 

మహేశ్‌ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్‌ అజహరుద్దీన్, వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, టీపీసీసీ నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు ఎంఏ ఫయీమ్, మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్, దీపక్‌జాన్, జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ నేతలు బండి రమేశ్, నీలం మధు, చనగాని దయాకర్, ఫహీం ఖురేషీ, పిడమర్తి రవితోపాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

అదుపులోకి తీసుకున్న అనంతరం మంత్రులు, కాంగ్రెస్‌ నేతలను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించగా, వారు స్టేషన్‌లోనే బైఠాయించి నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే బైఠాయించారు. వీరిని పరామర్శించేందుకు పెద్దఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు నాంపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం సొంతపూచీకత్తుపై నేతలను విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement