న్యూఢిల్లీ: నెల రోజులుగా ఉద్యమబాటలో పయనిస్తున్న తాము ఇకపై చర్చల బాటలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు సత్వరం చరమగీతం పాడాలంటూ ఉద్యమపంథాలో వెళ్తున్న తాము ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ‘‘చర్చలకు మోదీ సర్కార్ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమాచారమిచ్చారు. ఆయన అధికార నివాసంలో చర్చలకు రావాలని ఆహా్వనంపలికారు.
అయితే అధికారిక నివాసాల్లో చర్చలకు మేం సిద్ధంగా లేము. జంతర్‌మంతర్‌లో ప్రజాకోర్టు ఇప్పటికే కొలువుతీరి ఉంది. ప్రజలు వచ్చినట్లు మంత్రులూ ఇక్కడికొచ్చి చర్చిస్తే బాగుంటుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది’’అని దాస్ చెప్పారు. ‘‘మనందరం విద్యావంతులమే. జంతర్ మంతర్‌లో భద్రత పరంగా ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు అని ప్రభుత్వం భావిస్తే దీక్షాస్థలికి బదులుగా మరేదైనా తటస్థ వేదికపై చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. చర్చలకు మేం రెడీ అని ఎప్పుడో చెప్పాం. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనడం ఉత్తమమైన ప్రక్రియ. అయితే అర్థరహిత చర్చలకు మా ఉద్యమంలో చోటేలేదు.
నిరసనకారుల డిమాండ్ల సాధనకు కృషిజరిగేలా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకురావాలి. మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏ మేరకు సంసిద్ధంగా ఉందనేదే ఇక్కడ అసలు విషయం. ఎందుకంటే కాలం చాలా విలువైంది. ఇంకా వేలాది మంది జంతర్‌మంతర్‌లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితంనాటి పోలీసుల లాఠీచార్జ్, ఉద్యమకారుల ప్రతిఘటన ఉదంతంలో విద్యార్థులపై పోలీసులు ఎలాంటి కేసులు మోపకూడదు. ఉద్యమం ఉధృతమవుతోంది. ఢిల్లీ నుంచి ఉద్యమం గోవా, ముంబై, జైపూర్‌లకు పాకింది. ఇది సహజంగానే జాతీయస్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది’’అని దాస్ వ్యాఖ్యానించారు.


