సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్‌లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
నీట్ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్‌లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్‌కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.


