నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో, ఇటు మధ్యప్రదేశ్‌లోని కేన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సామాజిక కార్యకర్త అమిత్ భట్నాగర్ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఒకరి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తే, మరొకరి ఉద్యమంలో బాధితులు మాత్రమే పాల్గొంటున్నారు. ఆ ఉద్యమం దేశ వ్యాప్తంగా మాత్రం అంతగా వెలుగులోకి రాలేదు. అయినా ఆసుపత్రి మంచంపైనే అమిత్ భట్నాగర్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.
కేన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అమిత్ భట్నాగర్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి దాదాపు 6 ఏళ్లుగా అమిత్ భట్నాగర్ నాయకత్వం వహిస్తున్నారు. కేన్–బేత్వా ప్రాజెక్టు భారతదేశంలో అమలులోకి వచ్చిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.44,000 కోట్లకు పైగా ఉంది. కేన్ నది నుంచి బేత్వా నదికి నీటిని మళ్లించి బుందేల్‌ఖండ్‌లో నీటి కొరత తగ్గించడమే లక్ష్యం. 10 లక్షల హెక్టార్లకు పైగా సాగునీరు అందించాలనే ప్రణాళిక ఉంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కోట్లాది మందికి తాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉద్యమం ఎందుకు?
మరోవైపు వేలాది కుటుంబాల‍్లోని వారు నిర్వాసితులు అవుతాయని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దౌధన్ ఆనకట్ట వల్ల సుమారు 25,000 మంది, దాదాపు 10,000 కుటుంబాలు ప్రభావితమవుతాయని అంచనా. అనేక గ్రామాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని బాధితులు చెబుతున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఆధారంగా జీవించే గిరిజన కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పన్నా పులుల అభయారణ్యంపై కూడా ఈ ప్రాజెక్టు ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమిత్ భట్నాగర్ డిమాండ్లు
అర్హులైన చాలా కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని అమిత్ భట్నాగర్ ఆరోపించారు. అసలు ప్రభావితులు కాని కొందరికి పరిహారం చెల్లించారని కూడా ఆయన అంటున్నారు. గ్రామసభ ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయని, భూసేకరణ పారదర్శకంగా జరగలేదని ఆయన ఆరోపించారు. పరిహారంలో దాదాపు రూ.400 కోట్ల అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు.
అధికారులు ఏమంటున్నారు?
ఈ ఆరోపణలన్నింటినీ జిల్లా యంత్రాంగం నిరాధారమని ఖండించింది. చట్టప్రకారమే పునరావాసం, పరిహారం అందిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిరాహార దీక్షలో అమిత్ భట్నాగర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. అర్ధరాత్రి పోలీసులు ఉద్యమ స్థలాన్ని ఖాళీ చేయించి నిరసనను నిలిపివేశారని కార్యకర్తలు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, జీవనోపాధి, అటవీ హక్కులు కోల్పోకుండా న్యాయమైన పునరావాసం, పారదర్శక పరిహారం కల్పించాలనే డిమాండ్ ఈ ఉద్యమం ప్రధాన అంశంగా మారింది.


