సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పేపర్ లీక్ ఆందోళనలపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. నీట్ పేపర్ లీక్ నిరసనలకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థుల పోరాటం స్ఫూర్తిధాయకం అని అభినందించారు. అదే సమయంలో ఈ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఈ ఉద్యమాన్ని "హైజాక్" చేయవద్దని పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్‌పై సీజేపీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఈ నేపథ్యంలో సీజేపీ నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా సినీస్టార్ సల్మాన్ ఖాన్ సైతం విద్యార్థులకు తన మద్ధతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
సల్మాన్ తన పోస్ట్‌లో " ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది, దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు, దీని ఘనత మన దేశ విద్యార్థులకే దక్కాలి, ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది ఇరుపక్షాలకూ లాభదాయకమైన పరిస్థితి. సానుకూల నిర్ణయం కోసం ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక," అని ఆయన రాశారు.
ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దేశంలో విద్య ఒక 'ఫ్యాషన్ ట్రెండ్'గా మారితే, విదేశాల నుంచి విద్యార్థులు భారత్‌కు చదువుకోవడానికి వస్తారని తెలిపారు. కాగా నీట్ నిరసనలకు ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు ఓమీ వైద్య, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు మద్దతు ప్రకటించారు.


