breaking news
Squash Championship
-
ఆశాకిరణం అనాహత్
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది. కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. –సాక్షి క్రీడా విభాగం మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్‌గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్‌లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. 2005లో జోష్నా చినప్ప ఫైనల్‌కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్‌గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో 16 మంది... మహిళల సింగిల్స్‌లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్‌లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్‌లో అండర్–11 సింగిల్స్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. ‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్‌ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను. అనుకున్నది సాధించాను’– అనాహత్ సింగ్ -
చరిత్ర సృష్టించిన అనాహత్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆 First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026Read: సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా -
ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అనాహత్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)పై విజయాన్ని అందుకుంది. తద్వారా 21 ఏళ్ల తర్వాత ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డులకెక్కింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న అనాహత్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనుంది. గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జరిగిన మ్యాచ్‌లో అనాహత్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహత్ గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు పరిస్థితులు నాకు కఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదని మొదటి నుంచి గెలుపు కోసమే ప్రయత్నించాను. అయితే క్వార్టర్స్‌లో నమోదు చేసిన ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ సెమీస్‌లో విజయం నాకు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా నా తల్లిదండ్రులను, కోచ్‌లను హ్యాపీ చేయగలిగాను. కానీ ఫైనల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది. ANAHAT SINGH STORMS INTO THE FINALS OF JUNIOR WORLD C’SHIP 🏆🤩India’s Anahat defeated Barb Sameh of Egypt 🇪🇬 3-1 (11-3, 8-11, 11-4, 11-6) in the Semi Final!She became the second ever Indian to reach into the World Junior C’ship Final ✅WELL DONE! 🔥 pic.twitter.com/2wEfv2sDAK— The Khel India (@TheKhelIndia) July 25, 2026Read: రెండో టీ20కి భారత తుదిజట్టు అంచనా.. అతడిపై వేటు! -
సెమీస్‌లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ వరుసగా రెండో ఏడాది పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్లో టాప్ సీడ్ అనాహత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–7, 11–5, 6–11, 11–9తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. అనాహత్ ఫైనల్ చేరితే 2005లో జోష్నా చినప్ప తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా అనాహత్ గుర్తింపు పొందుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్, టాప్ సీడ్ అనాహత్ సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–4, 11–8, 11–3తో డాసీ యె సాన్ లీ (మలేసియా)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ హబీబా రిజ్క్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అనాహత్ కాంస్య పతకం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆసియా అండర్–19 చాంపియన్, భారత ప్లేయర్ ఆర్యవీర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆర్యవీర్ 4–11, 1–11, 5–11తో యాసీన్ షలాబీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
ఫైనల్లో అనాహత్, వీర్
కౌలాలంపూర్: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్, వీర్ చోత్రాని ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్ 11–2, 11–7, 11–6తో హెలెన్ టాంగ్ (హాకాంగ్)పై విజయం సాధించింది. 21 నిమిషాల్లో ముగిసిన పోరులో అనాహత్... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఐదు మ్యాచ్‌లు జరగగా... అన్నీట్లోనూ అనాహత్ విజయం సాధించడం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్లో టోబీ ట్సె (హాంకాంగ్)తో అనాహత్ తలపడనుంది. భారత మరో ప్లేయర్, రెండో సీడ్ ఆకాంక్ష పరాజయం పాలైంది. ఆకాంక్ష 3–11, 10–12, 12–10, 8–11తో టోబీ ట్సె చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వీర్ చోత్రాని కూడా ఫైనల్లో అడుగు పెట్టాడు. సెమీ ఫైనల్లో వీర్ చోత్రాని 11–7, 11–6, 7–11, 11–4తో ఎనిమిదో సీడ్ చి హిమ్ వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధిస్తారు. -
రాష్ట్ర స్క్వాష్ టోర్నీ విజేత తనూజ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గేమ్ పాయింట్’ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో అండర్–13 బాలుర సింగిల్స్ విభాగంలో పులి తనూజ్ రెడ్డి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో కొండపర్తి ప్రభాస్‌పై తనూజ్ రెడ్డి విజయం సాధించాడు. తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది విభాగాల్లో కలిపి మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబూరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గేమ్‌పాయింట్ తెలంగాణ స్క్వాష్ చాంపియన్‌షిప్ చైర్మన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. అండర్–13 బాలుర సింగిల్స్: 1. పులి తనూజ్ రెడ్డి, 2. కొండపర్తి ప్రభాస్. అండర్–15 బాలికల సింగిల్స్: 1. అర్ణా ద్వివేది, 2. గంజి ధృతి. అండర్–17 బాలుర సింగిల్స్: 1. రాజ్వీర్ గ్రోవర్, 2. రోహన్ అరిగల. పురుషుల సింగిల్స్: 1. కరణ్ వశిష్్ట, 2. రణ్వీర్ గ్రోవర్. మహిళల సింగిల్స్: 1. ఆర్యా ద్వివేది, 2. శాన్వీ శ్రీ. పురుషుల సింగిల్స్ (ప్లస్ 35): 1. సర్వేశ్ చౌహాన్, 2. సోలీ కొలా. పురుషుల సింగిల్స్ (ప్లస్ 40): 1. ప్రియతోశ్ దూబే, 2. మయాంక్ మల్హాన్. పురుషుల సింగిల్స్ (ప్లస్ 45): 1. దానం భరత్, 2. బత్తుల రామ్. -
శౌర్యకు కాంస్యం
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శౌర్య బావా భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీకి చెందిన శౌర్య 5–11, 5–11, 9–11తో టాప్ సీడ్, గత ఏడాది రన్నరప్ మొహమ్మద్ జకారియా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయాడు. 2014లో కుశ్ కుమార్ తర్వాత ఈ మెగా టోరీ్నలో పతకం నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా శౌర్య గుర్తింపు పొందాడు. -
అభయ్ సింగ్ డబుల్ ధమాకా
ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అభయ్‌సింగ్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్–వెలవన్ 11–4, 11–5తో ఒంగ్ సై హుంగ్–సిఫిక్ (మలేసియా)లపై నెగ్గారు. ‘మిక్స్డ్’ ఫైనల్లో అభయ్–జోష్నా చినప్ప (భారత్) 11–8, 10–11, 11–5తో టాంగ్ వింగ్–టాంగ్ హాంగ్ (హాంకాంగ్)లపై గెలిచారు. -
బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్
పారిస్: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిల్‌ను సాధించాడు. పారిస్‌లో జరిగిన బ్యాచ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ వెలవన్ 11–6, 11–9, 11–6తో మెల్విల్ సియానిమానికో (ఫ్రాన్స్)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్ రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్లో ఓడిపోయాడు. -
రన్నరప్‌గా అనాహత్ సింగ్
ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. బర్మింగ్హమ్లో జరిగిన ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల అనాహత్ సింగ్ అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో రజత పతకం గెలిచింది. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–7, 11–13, 10–12, 11–5, 9–11తో రెండో సీడ్ నాదీన్ ఎల్హమీ (ఈజిప్ట్) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ చరిత్రలో అనాహత్కిది మూడో పతకం. 2019లో అండర్–11 విభాగంలో, 2023లో అండర్–15 విభాగంలో అనాహత్ స్వర్ణ పతకాలు సాధించింది. -
ఆసియా క్రీడల్లో దీపిక పల్లికల్ జోడికి గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా స్క్వాష్ ఈవెంట్లో భారత్ గోల్డ్‌మెడల్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ద్వయం 11-10, 11-10తో మలేషియా జంట మొహమ్మద్ కమల్,ఐఫా అజ్మాన్‌లను ఓడించింది. దీంతో బంగారు పతకాన్ని ఈ భారత జోడీ కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో స్వాష్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు. స్వాష్ డబుల్స్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 84(20 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. కాగా ఇది స్క్వాష్‌లో రెండవ స్వర్ణం కావడం విశేషం. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే? 20th gold for India🥇🇮🇳 The experienced pair of Dipika Pallikal and Harinder Pal Singh Sandhu defeated the Malaysian duo 11-10 11-10 to clinch gold in the mixed doubles category of #Squash 🔥💯#AsianGames2022 #AsianGames pic.twitter.com/xcZKc7aVog — The Bridge (@the_bridge_in) October 5, 2023 -
స్వర్ణం నెగ్గిన దినేశ్ కార్తీక్ భార్య
హ్వాంగ్జౌ (చైనా): ఆసియా స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్ (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య) – హరీందర్‌పాల్ సింగ్ సంధు జోడి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో దీపిక – హరీందర్ 11–10, 11–8 స్కోరుతో ఇవాన్ యూయెన్ – రాచెల్ ఆర్నాల్డ్ (మలేసియా)పై విజయం సాధించారు. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్లో మలేసియాకు చెందిన టాప్ సీడ్ ఆయిరా అజ్మాన్ – షఫీక్ కమాల్‌ను...సెమీ ఫైనల్లో తయ్యద్ అస్లామ్ – ఫైజా జఫర్ (పాకిస్తాన్)ను భారత ద్వయం ఓడించింది. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. భారత్‌కు చెందిన అనాహట్ సింగ్ – అభయ్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. -
క్వార్టర్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ ఓటమి
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 14 ఏళ్ల అనాహత్ సింగ్ 7–11, 11–6, 8–11, 8–11తో ఫెరూజ్ అబూల్కెర్ (ఈజిప్ట్) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అనాహత్ రెండో రౌండ్లో 11–1, 11–3, 11–4తో మేరీ వాన్ రీత్ (బెల్జియం)పై, మూడో రౌండ్లో 11–5, 11–4, 11–8తో ఎమ్మా బార్ట్లే (ఇంగ్లండ్)పై గెలిచింది. -
Squash Championship: పాకిస్తాన్‌పై భారత్ విజయం
ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం భారత జట్టు 2–1తో పాకిస్తాన్ జట్టును ఓడించింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ 9–11, 7–11, 11–1, 11–7, 11–8తో తయ్యబ్ అస్లమ్‌ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అంతకుముందు మరో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో జపాన్‌పై గెలిచింది. ప్రస్తుతం భారత్ పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. -
మూడో రౌండ్లో జోష్నా
కైరో (ఈజిప్ట్): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి జోష్నా చినప్ప మూడో రౌండ్‌కు చేరింది. హో జె లాక్ (హాంకాంగ్)తో శనివారం జరిగిన రెండో రౌండ్లో 12వ సీడ్ జోష్నా 11–5, 11–4తో రెండు గేమ్‌లను గెలిచి, మూడో గేమ్‌లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. -
విజేతలు తుషార్, ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో తుషార్ కొఠారి, ఐశ్వర్య పయ్యన్ విజేతలుగా నిలిచారు. మాదాపూర్‌లోని గేమ్ పాయింట్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో రవి పాండేపై తుషార్.. మహిళల తుదిపోరులో సుజాత పయ్యన్‌పై ఐశ్వర్య పయ్యన్ గెలుపొంది ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. అండర్–17 బాలబాలికల విభాగాల్లో రోహన్ ఆర్య, ఐశ్వర్య చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో ధ్రువ్‌కుమార్‌పై రోహన్ గెలుపొందగా, ఖుషిని ఐశ్వర్య ఓడించింది. అండర్–15 బాలుర ఫైనల్లో ధ్రువ్ కుమార్‌పై రోహన్ ఆర్య గెలుపొంది టైటిల్‌ను అందుకున్నాడు. అండర్–13 బాలికల టైటిల్‌పోరులో శాని్వశ్రీపై ఆర్య, బాలుర తుదిపోరులో వివాన్‌పై రాజ్వీర్ గెలిచారు. అండర్–11 బాలుర విభాగంలో ఏకాన్ష్ ఆనంద్‌ను ఓడించి రాజ్వీర్ గ్రోవర్ విజేతగా నిలిచాడు. 45 ఏళ్లు పైబడిన పురుషుల విభాగంలో అరవింద్, రవికృష్ణ తొలి స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప
ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఫైనల్లోకి దూసుకెళ్లారు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2017 రన్నరప్ సౌరవ్ 11–2, 11–6, 11–4తో ఎన్జీ ఎయిన్ యో (మలేసియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జోష్నా 11–7, 12–10, 11–3తో శివసంగరి సుబ్రమణియం (మలేసియా)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్స్‌లో ఆనీ అయు (హాంకాంగ్)తో జోష్నా; లియో చున్ మింగ్ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతారు. -
భారత్‌కు తొమ్మిదో స్థానం
పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తొమ్మిదో స్థానం లభించింది. కెనడాతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 13-11, 11-5, 7-11, 11-7తో హోలీ నాటన్పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో దీపిక పళ్లికల్ 11-7, 11-5, 11-2తో సమంతా కార్నెట్‌ను ఓడించింది. ఫలితం తేలిపోవడంతో ఆకాంక్ష, డానియెలా మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. -
భారత్ పరాజయం
పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఓటమితో ఆరంభించింది. సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ విభాగంలో భారత్ 0-3తో టాప్ సీడ్ ఈజిప్ట్ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నౌర్ ఎల్ షౌర్బిని చేతిలో భారత స్టార్ జోష్న చినప్ప 5-11, 6-11, 13-15తో ఓడింది. ఇక దీపికా పళ్లికల్ కాస్త పోరాడినా 11-4, 7-11, 4-11, 9-11తో నౌరన్ గోహర్ చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో సునయన కురువిల్లా 7-11, 7-11, 2-11తో అబ్దెల్ చేతిలో చిత్తుగా ఓడింది. నేడు (మంగళవారం) జరిగే మ్యాచ్‌లో మెక్సికోతో భారత్ తలపడుతుంది. -
ముగిసిన జోష్నా పోరు
కౌలాలంపూర్ (మలేసియా): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ జోష్నా చిన్నప్ప 3-11, 6-11, 3-11తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లారా మసారో (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జోష్నా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేదు. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే


