ఫైనల్లో అనాహత్, వీర్‌ | Anahat Singh and Veer Chotrani storm into finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో అనాహత్, వీర్‌

Apr 20 2025 1:45 AM | Updated on Apr 20 2025 1:45 AM

Anahat Singh and Veer Chotrani storm into finals

కౌలాలంపూర్‌: ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్, వీర్‌ చోత్రాని ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఐదో సీడ్, 17 ఏళ్ల అనాహత్‌ 11–2, 11–7, 11–6తో హెలెన్‌ టాంగ్‌ (హాకాంగ్‌)పై విజయం సాధించింది. 21 నిమిషాల్లో ముగిసిన పోరులో అనాహత్‌... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. 

ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఐదు మ్యాచ్‌లు జరగగా... అన్నీట్లోనూ అనాహత్‌ విజయం సాధించడం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్లో టోబీ ట్సె (హాంకాంగ్‌)తో అనాహత్‌ తలపడనుంది. భారత మరో ప్లేయర్, రెండో సీడ్‌ ఆకాంక్ష పరాజయం పాలైంది. ఆకాంక్ష 3–11, 10–12, 12–10, 8–11తో టోబీ ట్సె చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ వీర్‌ చోత్రాని కూడా ఫైనల్లో అడుగు పెట్టాడు. 

సెమీ ఫైనల్లో వీర్‌ చోత్రాని 11–7, 11–6, 7–11, 11–4తో ఎనిమిదో సీడ్‌ చి హిమ్‌ వాంగ్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ప్లేయర్లు మే 9 నుంచి 17 వరకు చికాగోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధిస్తారు.  

Advertisement
 
Advertisement
Advertisement