జేఈఈ ఫెయిల్యూర్‌..ఇవాళ ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ | V Kamakoti: He didn't crack JEE years later he became IIT Madras director | Sakshi
Sakshi News home page

జేఈఈ ఫెయిల్యూర్‌..ఇవాళ ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌

Jul 1 2026 1:57 PM | Updated on Jul 1 2026 2:11 PM

V Kamakoti: He didn't crack JEE years later he became IIT Madras director

భారతదేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈలో అతడు ఫెయిల్‌. కెమిస్ట్రీలో కేవలం ఒక్క మార్కు సంపాదించుకుని జేఈఈలో ఉ‍త్తీర్ణత సాధించలేకపోయిన వ్యక్తి. అయితేనేం..కొన్నేళ్లకు అదే పరీక్షను నిర్వహించే స్థాయికి చేరి.. ఐఐటీ మద్రాస్‌కు డైరెక్టర్‌ అయ్యారు. ఆయన కథ ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్నాం అని బాధపడే ఔత్సాహిక విద్యార్థులకు ఓ స్ఫూర్తి.

ఆయనే ఐఐటి మద్రాస్ డైరెక్టర్‌ వి కామకోటి. ఆయన ఒకప్పుడు జేఈఈ గెలుపు కోసం ఆరాటపడ్డ విద్యార్థి. తనకు కెమిస్ట్రీలో ఒకే ఒక్క మార్కు రావడంతో జేఈఈ ఉత్తీర్ణత సాధించలేకపోయానని చెప్పారు. ఆ రోజు ఆ ఒక్క పరీక్ష తన విజయాన్ని డిసైడ్‌ చేయలేదని గట్టిగా అనుకున్నానని అన్నారు. అది తన ఇంజనీరింగ్‌ భవిష్యత్తు కాలరాయదని నమ్మారు. అదే నిజం చేశారు. ఇతర మార్గాల ద్వారా సాధారణ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌  చదువుని కొనసాగించారు. 

ఆయన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ అండ్‌ పీహెచ్‌డీ రెండిటిని సంపాదించారు. అలా ఆయన 2001లో ఐఐటీ మద్రాస్‌లో అధ్యాపకుడిగా చేరారు. ఏళ్లు గడిచే కొద్దీ కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగాలలో విశేష కృషి చేశాడు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో సహా అనేక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సాంకేతిక కార్యక్రమాలకు ఆయనే స్వయంగా నాయకత్వం వహించారు. 

విచిత్రమేమిటంటే, ఒకప్పుడు జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆయనే ఆ తర్వాత ఐఐటి మద్రాస్‌లో జేఈఈ విభాగానికి ఛైర్మన్‌ అయ్యారు. ఒకప్పుడు తనను తిరస్కరించిన అదే పరీక్షను పర్యవేక్షించే స్థాయికి చేరుకున్నారు. పరిశోధకుడి నుంచి భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యావేత్తలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. జనవరి 2022లో తన మాతృసంస్థ అయిన ఐఐటి మద్రాస్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే, ఆయన ఆ సంస్థ మైక్రోప్రాసెసర్ అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహించడం తోపాటుజాతీయ సమాచార భద్రతా కార్యక్రమాలకు అధిపతిగా కూడా ఉన్నారు. 

అంతేగాదు ఆయన  ఆయన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్‌కు కూడా అధ్యక్షత వహించారు. ఆయన చేసిన సేవలకు గానూ, డీఆర్డీఓ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, అలాగే భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. 

ఆయన ఎప్పుడు ర్యాకింగ్‌లు, అవార్డులకు అతీమైన విషయాలనే విద్యార్థులతో మాట్లాడుతారు. కేవలం భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం అవ్వడమే ప్రధానమని బోధిస్తుంటారు. ఆయన దృష్టిలో ఇంజనీరింగ్‌ విద్య అంటే కేవలం పట్టభద్రులు అ‍వ్వడం కాదని నిజ జీవిత సమస్యలను పరిష్కరించగల ఆవిష్కర్తలగా మారాలని అన్నారు. 

ఎల్లప్పుడూ అజేయమైన విజయాలే కాదు ఇలా ఎదురుదెబ్బల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కథే అత్యంత ప్రేరణగా. ఇక్కడ కామకోటి గారి కథ ఒక పరీక్ష మనలన్ని నిర్ణయించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. వచ్చే ‍ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే విజయం తథ్యం అని చెబుతోంది కదూ.

(చదవండి: భార్య కోసం ఉద్యోగం వదిలేసి..!)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement