నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?
– సరస్వతి, నెల్లూరు.
తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం.
ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే..
పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!
శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.
సహజమైన మెదడు బూస్టర్!
తల్లిపాలలో ఉండే డీహెచ్‌ఏ, ఏఆర్‌ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.
తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!
తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.
తొలి బంగారు చుక్కలు!
పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.
ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది.
తల్లికి అండగా... సమాజం కూడా!
పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!
డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్


