అగడం బగడం
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్‌లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.
పాచామామా అంటే...
‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.
ఆగస్టులోనే ఎందుకు?
ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రధాన ఆచారాలు
ఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.
ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.
ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి.
పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం.
∙ రమా జంబుల


