breaking news
Andes Mountains
-
పెరూ ఆండీస్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం
పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతం శక్తివంతమైన భూకంపంతో ఒక్కసారిగా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి దక్షిణ భాగంలోని ఇకా, అరెక్విపా ప్రాంతాలు వణికిపోయాయి. జనాలు ఇళ్లలోంచి పరుగులు తీసి.. బయటే గడిపారు. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రటించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణ పెరూలో గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం అయాకుచో ప్రాంతంలోని పరినకోచాస్ ప్రావిన్స్‌లోని ఉపాహుచో పట్టణానికి వాయువ్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. భూకంపం 66.7 కిలోమీటర్ల లోతులో సంభవించింది.ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెరూ పౌర రక్షణ విభాగం అధికారి లూయిస్ వాస్కెజ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని తెలిపారు. పరినకోచాస్ ప్రావిన్స్ మేయర్ యోనీ రేయెస్ కూడా ప్రావిన్స్ రాజధానిలో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వెల్లడించారు.సునామీ ముప్పు లేదన్న నేవీభూకంపం తర్వాత పెరూ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం ఏమైనా జరిగిందా? అనే దానిపై అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని పెరూ నేవీ స్పష్టం చేసింది.‘రింగ్ ఆఫ్ ఫైర్’లో పెరూపెరూ తరచూ భూకంపాలకు గురవుతుంది. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న అత్యంత చురుకైన భూకంప మండలమైన రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఆ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. భూకంప కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా తరచూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి.పెరూలో గతంలోనూ భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఇదే ఆండీస్ రీజియన్‌లో జులైలో సంభవించిన భూకంపంలో ఐదుగురు మరణించగా.. 21 మందికి గాయాలు అయ్యాయి. అంతకు ముందు 2007 ఆగస్టులో మధ్య పెరూ తీరానికి సమీపంలో 8.0 తీవ్రతతో సంభవించిన భూకంపం.. పిస్కో, చించా ఆల్టా, ఇకా ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 519 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది లోతైన ప్రాంతంలో సంభవించడంతో ఇప్పటివరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నైజీరియాలో ఘోర విషాదం -
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.పాచామామా అంటే...‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.ఆగస్టులోనే ఎందుకు?ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రధాన ఆచారాలుఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం. ∙ రమా జంబుల -
ఈక్వెడార్ అడవుల్లో అందాల పక్షి ఆఖరి పోరాటం
అండీస్ పర్వతాల దట్టమైన పొగమంచులో, మేఘాలను తాకే ఎత్తయిన అడవుల మధ్య ఓ అపురూపమైన అందాల జీవి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. అది ఒక అద్భుతమైన తేనె పిట్ట (హమ్మింగ్ బర్డ్). దాని పేరు ‘బ్లాక్–బ్రెస్టెడ్ పఫ్‌లెగ్’. కేవలం 9 సెంటీమీటర్ల పొడవుండే ఈ చిన్ని పిట్టను చూస్తే ప్రకృతి ఒక అందమైన కళాఖండాన్ని సృష్టించిందా.. అనిపిస్తుంది. ఈక్వెడార్ రాజధాని క్విటోకు చిహ్నమైన ఈ హమ్మింగ్ బర్డ్ (తేనె పిట్ట), ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా నిలిచింది. ప్రమాదంలో ‘చిన్నారి దేవతలు’ ఈ పక్షిని చూడగానే అందరినీ ఆకట్టుకునేది.. దాని కాళ్ల చుట్టూ ఉండే తెల్లటి మెత్తని ఈకలు. అవి చిన్నారి పిట్ట ‘నిక్కరు’వేసుకున్నట్లు అనిపిస్తాయి. కాంస్య–పచ్చ రంగులో మెరిసిపోయే రెక్కలతో ఇది అడవిలో ఒక ఎగిరే మణిలా కనిపిస్తుంది. అందుకే దీనిని అండీస్ పర్వతాల ‘చిన్నారి దేవత’అని పిలుచుకుంటారు. వందల్లో మిగిలిన పక్షులు దురదృష్టవశాత్తూ, ఈ అందమైన పక్షులు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కేవలం 150 నుండి 200 లోపు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి స్వార్థమే.. పశువుల మేత, వ్యవసాయం కోసం అడవులను నరికేయడంతో ఈ పిట్టలకు గూడు లేకుండా పోతోంది. ఇవి సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉండే నిర్దిష్టమైన అడవుల్లోనే బతకగలవు. ఆ ప్రాంతాలే ఇప్పుడు వ్యవసాయ భూములుగా మారిపోతున్నాయి. ఊపిరి నిలిపే ‘యానకోచా రిజర్వ్’ ఈ పక్షులను కాపాడేందుకు ‘జోకోటోకో ఫౌండేషన్’25 ఏళ్ల క్రితం ‘యానకోచా రిజర్వ్’ను ఏర్పాటు చేసింది. ‘మేము కేవలం ఒక పక్షిని మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థనే కాపాడుతు న్నాం’.. అని పర్యావరణవేత్త పావలా విల్లాల్బా స్పష్టం చేశారు. ప్రస్తుతం పిచించా అగ్నిపర్వత వాలు ప్రాంతాల్లో ఈ అడవులను మళ్లీ పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెజాన్ కార్చిచ్చుల ఎఫెక్ట్
వాషింగ్టన్: పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెజాన్ అడవులకు దాదాపుగా 2 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అండిస్ పర్వత శ్రేణుల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. అడవులు తగలబడడంతో సూక్ష్మమైన కాలుష్యకారక బొగ్గు కణాలు గాల్లో కలుస్తాయి. ఇవి వాయువేగంతో ప్రయాణించి అండీన్ హిమనీనదంపై పేరుకుంటున్నాయి. బ్రెజిల్‌కు చెందిన రియోడీజనీరో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అమెజాన్ కార్చిచ్చులకు, హిమనీనదాలు కరగడానికి మధ్య సంబంధంపై అధ్యయనం చేసి ఈ విషయాలు వెల్లడించారు. -
ఘోర ప్రమాదం : 23 మంది మృతి
లిమా: పెరూ ఆగ్నేయ ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అండీస్ పర్వత ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మపాచో నదిలో పడింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుస్కో నగరంతోపాటు సమీప పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్రిడ్జ్ పనులు జరగుతుందని...ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. ఆదివారం పెరూలో దేశాధ్యక్షడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్యూర్టో మల్డోనాడో నగరం నుంచి కుస్కో నగరానికి ప్రయాణికులు వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
మస్తాన్ బాబు ఖర్చులు మేమే భరిస్తాం: వెంకయ్య
అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో మరణించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం తరలింపునకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన మల్లి బాబు మాతృమూర్తికి సానుభూతి తెలిపారు. ఈ విషయమై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చర్చించానని, అర్జెంటీనాలోని భారత దౌత్యాకార్యాలయంతో ఆమె సంప్రదింపులు జరిపారని వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. 'మృతదేహం తరలిపునకు రెండు మార్గాలున్నాయి. ప్రతేక హెలికాప్టర్‌ను పంపడమా లేక సుశిక్షితులైన పర్వతారోహకుల ద్వారా మల్లిబాబు మృతదేహాన్ని కిందికి దించడమా అనే దానిపై సమాలోచన సాగుతోంది' అని వెంకయ్య నాయుడు అన్నారు. ఐదు ఖండాల్లో పర్వతాలను అధిరోహించి గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మల్లిబాబు.. ఆండీస్ పర్వతశ్రేణుల్ని అధిరోహించేందుకు వెళ్లి గత మార్చి 24న అదృష్యమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన మృతదేహాన్ని గుర్తించారు. -
మల్లి మస్తాన్ బాబు దుర్మరణం
నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కథ విషాదంగా ముగిసింది. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు. మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం. కాగా కుమారుడి జాడ తెలియకపోవటంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కొడుకు ఎప్పటికైనా సజీవంగా తిరిగి వస్తాడనుకున్న ఆమె...మస్తాన్ బాబు మరణవార్తతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడేదీ?
మూడు గంటల హెలికాప్టర్ గాలింపులో కనపడని వైనం కేంద్రం నుంచి సాయం శూన్యం వెతుకలాటలో స్నేహితులు సంగం : మండలంలోని గాంధీజనసంగంకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు జాడపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిలీ సమీపంలోని ఆండీస్ పర్వాతాల్లో హెలికాప్టర్ గాలింపులో మస్తాన్‌బాబు జాడ కనపడలేదు. భారతదేశ సాయం శూన్యంగా మారిందని, తామే వెతుకులాడుతున్నామని స్నేహితులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మస్తాన్‌బాబు వెతుకులాటకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి ఆరుగంటల వరకు హెలికాప్టర్ ఏరియల్ సర్వే సాగింది. ఈ సర్వేలో మస్తాన్‌బాబు జాడ కనపడలేదని సర్వే సిబ్బంది వెల్లడించారు. ఈ సర్వే సమయంలో ఇంగ్లాండ్ మౌంటనీర్ ఒకరు తారసపడగా ఆయన్ను తీసుకొచ్చినట్లు సిబ్బంది చె బుతున్నారని మస్తాన్‌బాబు అన్న పెద్ద మస్తాన్‌బాబు తెలిపారు. ఏరియల్ సర్వే కేవలం 5వేల మీటర్ల ఎత్తువరకు సాగిందని, అంతకన్నా పైకి వెళ్లే సామర్థ్యం ఏరియల్ సర్వే చేస్తున్న హెలికాప్టర్‌కు లేదని మస్తాన్‌బాబు స్నేహితులు తెలిపారన్నారు. మూడు గంటల వరకు గాలింపు జరిపి ప్రస్తుతం ఆపి ఉన్నారన్నారు. భారతదేశ సాయం శూన్యం మస్తాన్‌బాబు వెతుకులాటకు అవసరమైన సాయం చేస్తామన్న కేంద్రమంత్రులు మాటలకే పరిమితమయ్యారు. ఇంతవర కు దానికి సంబంధించిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మస్తాన్‌బాబు స్నేహితులు తమతో అన్నట్లు పెదమస్తాన్బాబు పేర్కొన్నారు. స్నేహితులైన మౌంటనీర్లు తామే స్వయంగా వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. వాళ్లు వెతికి తీసుకుని వస్తే తప్ప మరో గత్యంతరం లేదని అన్నారు. -
లోయలో పడిన బస్సు: 15 మంది మృతి
పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఆండీస్ పర్వతాల సముదాయంలోని లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఏడాది వయస్సు గల చిన్నారి కూడా ఉందని ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మరో 58 మంది ప్రయాణికులు గాయపడ్డారని చెప్పారు. నిన్న సాయంత్రం ఆ బస్సు చోటు చేసుకుందని పేర్కొన్నారు. దుర్ఘటన చోటు చేసుకున్న ప్రదేశం పెరూ రాజధాని లిమాకు 216 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదికాక నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఆ ఘటనపై తమకు చాలా ఆలస్యంగా సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గాయపడిన వారిని వివిధ ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అండీస్ పర్వత శ్రేణుల్లో ప్రయాణం అంటేనే అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆదే రహదారిపై జరిగిన వివిధ ప్రమాదాలలో దాదాపు 4 వేల మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. ఆ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.


