అండీస్ పర్వతాల దట్టమైన పొగమంచులో, మేఘాలను తాకే ఎత్తయిన అడవుల మధ్య ఓ అపురూపమైన అందాల జీవి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. అది ఒక అద్భుతమైన తేనె పిట్ట (హమ్మింగ్ బర్డ్). దాని పేరు ‘బ్లాక్–బ్రెస్టెడ్ పఫ్‌లెగ్’. కేవలం 9 సెంటీమీటర్ల పొడవుండే ఈ చిన్ని పిట్టను చూస్తే ప్రకృతి ఒక అందమైన కళాఖండాన్ని సృష్టించిందా.. అనిపిస్తుంది. ఈక్వెడార్ రాజధాని క్విటోకు చిహ్నమైన ఈ హమ్మింగ్ బర్డ్ (తేనె పిట్ట), ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా నిలిచింది.
ప్రమాదంలో ‘చిన్నారి దేవతలు’
ఈ పక్షిని చూడగానే అందరినీ ఆకట్టుకునేది.. దాని కాళ్ల చుట్టూ ఉండే తెల్లటి మెత్తని ఈకలు. అవి చిన్నారి పిట్ట ‘నిక్కరు’వేసుకున్నట్లు అనిపిస్తాయి. కాంస్య–పచ్చ రంగులో మెరిసిపోయే రెక్కలతో ఇది అడవిలో ఒక ఎగిరే మణిలా కనిపిస్తుంది. అందుకే దీనిని అండీస్ పర్వతాల ‘చిన్నారి దేవత’అని పిలుచుకుంటారు.
వందల్లో మిగిలిన పక్షులు
దురదృష్టవశాత్తూ, ఈ అందమైన పక్షులు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కేవలం 150 నుండి 200 లోపు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి స్వార్థమే.. పశువుల మేత, వ్యవసాయం కోసం అడవులను నరికేయడంతో ఈ పిట్టలకు గూడు లేకుండా పోతోంది. ఇవి సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉండే నిర్దిష్టమైన అడవుల్లోనే బతకగలవు. ఆ ప్రాంతాలే ఇప్పుడు వ్యవసాయ భూములుగా మారిపోతున్నాయి.
ఊపిరి నిలిపే ‘యానకోచా రిజర్వ్’
ఈ పక్షులను కాపాడేందుకు ‘జోకోటోకో ఫౌండేషన్’25 ఏళ్ల క్రితం ‘యానకోచా రిజర్వ్’ను ఏర్పాటు చేసింది. ‘మేము కేవలం ఒక పక్షిని మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థనే కాపాడుతు న్నాం’.. అని పర్యావరణవేత్త పావలా విల్లాల్బా స్పష్టం చేశారు. ప్రస్తుతం పిచించా అగ్నిపర్వత వాలు ప్రాంతాల్లో ఈ అడవులను మళ్లీ పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


