మిసైల్ టెస్టింగ్ కోసం గుర్తించిన డేంజర్ జోన్ మ్యాప్
ఈ నెల 22 నుంచి 24 వరకూ ఆ పరిధిలో విమానాల దారిమళ్లింపు.. మరోసారి నోటమ్ జారీ
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో విశాఖ సముద్రతీరం నుంచి హిందూమహాసముద్రం వరకూ 3,240 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్ష కోసం నో ఫ్లైయింగ్ జోన్‌గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) ప్రకారం ఈ మిసైల్ టెస్టింగ్ ఈనెల 22 నుంచి 24 మధ్య జరగనుందని స్పష్టం చేసింది. తొలుత డిసెంబర్ 1 నుంచి 4 తేదీల్లో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3,485 కి.మీ ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా గుర్తించారు. దాన్ని రద్దు చేస్తూ ఈ నెల 7న మరోసారి కొత్త నో ఫ్లైజోన్‌ను 1190 కిలోమీటర్లుగా ప్రకటించారు.
మళ్లీ శుక్రవారం తాజాగా నోటమ్ జారీ చేశారు. ఇందుకోసం మొత్తం 3,240 కి.మీ తీర ప్రాంతం వరకూ డేంజర్ జోన్‌గా డిక్లేర్ చేశారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతను ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్‌ను ప్రకటించారు. పైలెట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ అందజేయనున్నారు.
విమాన ప్రయాణానికి ఆటంకం కలిగించే మార్పులు లేదా ప్రమాదాల గురించి పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానయాన సిబ్బందికి ముందుగానే ఇచ్చే హెచ్చరిక ప్రకటననే ’నోటమ్’ అని పిలుస్తారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంతవరకూ ఆ పరిధిలో పౌర,యుద్ధ విమానాలను దారిమళ్లిస్తారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 4.30 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 8.30 గంటల మధ్య ఎప్పుడైనా ఈ మిసైల్ టెస్టింగ్ ఉండే అవకాశం ఉందని భారతరక్షణ వర్గాల సమాచారం.


