జోన్‌.. జటిలం | - | Sakshi
Sakshi News home page

జోన్‌.. జటిలం

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

జోన్‌

జోన్‌.. జటిలం

కుండ బద్దలు కొట్టిన అశ్వినీ వైష్ణవ్‌

వైజాగ్‌ జోన్‌పై కమ్ముకుంటున్న నీలినీడలు

బడ్జెట్‌ కేటాయింపుల విషయంలోనూ మొండిచెయ్యి

‘దక్షిణ కోస్తా’ ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో పనిచేస్తున్నామన్న కేంద్ర మంత్రి

గెజిట్‌ కోసం మరికొన్నాళ్లు ఆగాల్సిందేనా.?

సాక్షి, విశాఖపట్నం: పార్లమెంట్‌లో విత్తమంత్రి బడ్జెట్‌ ప్రసంగం.. వైజాగ్‌ వాసుల్ని నిరుత్సాహంలోకి నెట్టేస్తే.. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. రైల్వే మంత్రి మరింత నిస్పృహలోకి నెట్టేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించే అంశం కాస్తా జటిలంగా ఉందని, దీని కోసం ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో పనిచేస్తున్నామంటూ అశ్వినీ వైష్ణవ్‌ చేసిన వ్యాఖ్యలతో.. నీలినీడలు మళ్లీ కమ్ముకున్నాయి. ఇప్పట్లో గెజిట్‌ విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు వాల్తేరు డివిజన్‌కు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ మొండిచెయ్యి చూపించారు.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన వచ్చి ఆరేళ్లు గడిచినా కార్యకలాపాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఓవైపు.. జోన్‌ ప్రధాన కార్యాలయం పనులు జరుగుతుండగా.. మరోవైపు తాత్కాలిక కార్యాలయం సిద్ధమైనా.. గెజిట్‌ విడుదలకు మాత్రం ఇంకా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ నోచుకోలేదు. గతేడాది దసరాకు గెజిట్‌ వస్తుందని ఊరించారు. తర్వాత దీపావళి.. క్రిస్మస్‌.. సంక్రాంతి.. ఇలా పండగలు వస్తూ వెళ్తున్నా.. కార్యకలాపాలు మాత్రం మొదలవ్వకపోవడం చూస్తే... ఈ వ్యవహారం జటిలంగా మారుతోందని అర్థమవుతోంది. తాజాగా.. రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. ‘దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ జఠిలమైన వ్యవహారం. జోన్‌కోసం ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో పనిచేస్తున్నాం. కంట్రోల్‌ కమాండ్‌ టైమ్‌టేబుల్‌, సిబ్బంది సహా మొత్తం మార్చాల్సి ఉంది. ఈ మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా పనిచేస్తున్నాం..’ అంటూ అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడటం చూస్తే.. జోన్‌ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ జోన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు గాని, ఇతర ప్రకటనలు కానీ చెయ్యకపోవడం చూస్తే.. వైజాగ్‌లో జోన్‌ అధికారులు తమ విధుల్ని నిర్వర్తించేందుకు అవసరమైన గెజిట్‌ విడుదలయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

చురుగ్గా జోన్‌ పనులు : డీఆర్‌ఎం లలిత్‌ బోరా

విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం పనులు చురుగ్గా సాగుతున్నాయని వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బోరా తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే బడ్జెట్‌లో కేటాయింపుల వివరాల్ని వెల్లడించారు. 2009–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో వార్షిక సగటు బడ్జెట్‌ కేవలం రూ.886 కోట్లు ఉండగా, 2026–27 నాటికి రూ.10,134 కోట్లకు చేరడం శుభపరిణామమన్నారు. దశాబ్ద కాలంలో రైల్వే బడ్జెట్‌ దాదాపు 11 రెట్లు బడ్జెట్‌ పెరిగిందనీ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.92,649 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాన్నారు. ‘అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం’ కింద 73 స్టేషన్ల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 8 జతల వందే భారత్‌, 8 జతల అమృత్‌ భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే డివిజన్‌ వారీగా కేటాయింపుల వివరాల్ని రైల్వే బోర్డు ప్రకటిస్తుందని డీఆర్‌ఎం లలిత్‌ బోరా స్పష్టం చేశారు.

జోన్‌.. జటిలం1
1/1

జోన్‌.. జటిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement