చావు అంచుల నుంచి క్షేమంగా.. | - | Sakshi
Sakshi News home page

చావు అంచుల నుంచి క్షేమంగా..

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

చావు అంచుల నుంచి క్షేమంగా..

చావు అంచుల నుంచి క్షేమంగా..

● విశాఖ తీరానికి 9 మంది గంగ పుత్రులు ● బంగ్లాదేశ్‌ జైలు నుంచి విముక్తి ● ఆనందభాష్పాలతో నిండిపోయిన హార్బర్‌

నాలుగు నెలల చీకటి వీడింది.. గంగ పుత్రుల కన్నీళ్లు తుడిచింది. బంగ్లాదేశ్‌ చెర నుంచి విముక్తులై, చావు అంచుల్లో నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చిన మత్స్యకారులు సోమవారం ఉదయం తమ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆత్మీయుల ఆలింగనాలతో ఫిషింగ్‌ హార్బర్‌ కన్నీటి సంద్రమైంది. – బీచ్‌రోడ్డు

ఇంజిన్‌ వైఫల్యంతో అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి, బంగ్లాదేశ్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఇళ్లకు చేరారు. గత ఏడాది అక్టోబర్‌ 14న వేటకు వెళ్లిన వీరు అక్టోబర్‌ 22న అరెస్ట్‌ అయ్యి బాగర్‌హాట్‌ జైలులో నాలుగు నెలల పాటు మగ్గారు. కేంద్ర ప్రభుత్వం, మత్స్యకార సంఘాల చొరవతో జైలు నుంచి విముక్తి పొంది, సోమవారం ఉదయం ప్రత్యేక షిప్‌లో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకున్నారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, మైరెన్‌ పోలీసులు వీరికి స్వాగతం పలికి, కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిత్యావసరాలు అందజేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చావు అంచుల్లో నుంచి తిరిగి వచ్చామంటూ మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు.

కీలకపాత్ర పోషించిన జానకిరామ్‌

9 మంది మత్స్యకారుల విడుదలలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్‌ కీలక పాత్ర పోషించారు. స్వయంగా బంగ్లాదేశ్‌ వెళ్లిన ఆయన, అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి మత్స్యకారుల విముక్తికి కృషి చేశారు. జైల్లో ఉన్న సమయంలో బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడించి, వారి కుటుంబాల్లో ధైర్యం నింపారు.

భావోద్వేగలతో నిండిన హార్బర్‌

బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలైన తొమ్మిది మంది మత్స్యకారులు విశాఖ తీరానికి చేరుకోవడంతో హార్బర్‌లో భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. అసలు తిరిగి వస్తామో లేదో అన్న భయం నుంచి విముక్తి పొంది.. తమ కుటుంబ సభ్యులను చూడగానే మత్స్యకారులు ఆనంద భాష్పాలతో వారిని ఆలింగనం చేసుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చిన తమ వారిని చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.

విడుదలైన మత్య్సకారులు వీరే..

విశాఖ జిల్లాకు చెందిన మారుపల్లి చిన్న అప్పన్న, మారుపల్లి ప్రవీణ్‌ ,నక్క రమణ, మారుపల్లి రమేష్‌, విజయనగరం జిల్లాకు చెందిన వాసుపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న , సురపటి రాము, మారుపల్లి చిన్న అప్పన్న, సూరడ అప్పలకొండ.

ప్రాణాలతో వస్తారనుకోలేదు

నా భర్త సంపాదన మీదే ఇద్దరు పిల్లలు, ఇల్లు గడవాలి. ఆయన బంగ్లా జైలులో ఉన్నారని తెలియగానే ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. అసలు తిరిగి వస్తారో లేదో తెలియక, ఈ నాలుగు నెలలు తిండి కూడా సహించలేదు. మత్స్యకార నాయకులు మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది, వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నాం. ఆయన క్షేమంగా తిరిగి రావడం మాకు పునర్జన్మ లాంటిది. –మరుపల్లి జ్యోతి, మత్యకారుడు చిన్న అప్పన్న భార్య

బిడ్డ ముఖం చూశాక.. కష్టమంతా మర్చిపోయా

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం వేటకు వెళ్లా. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన సమయంలోనే బాబు పుట్టాడని తెలిసింది. వాడిని ఎప్పుడు చూస్తానా అని క్షణమొక యుగంలా గడిపాను. నెల రోజుల బాబును ఇవాళ చేతుల్లోకి తీసుకోగానే ఆ జైలు కష్టాలు, భయాలన్నీ మర్చిపోయాను. మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన వారందరికీ రుణపడి ఉంటాను.

–సూరాడ అప్పలకొండ, మత్స్యకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement