ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి
రూ.16వేలు లంచం తీసుకొంటుండగా పట్టివేత
గాజువాక: జీవీఎంసీ 74వ వార్డు నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంటి పన్ను మార్పు కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.16వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వార్డులోని పైడిమాంబ కాలనీకి చెందిన పల్లా సత్తిబాబు ప్రభుత్వ భూమిలో ఒక షెడ్డు నిర్మించుకొని జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటి కొళాయి పన్ను చెల్లిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఆ షెడ్డుకు సత్తిబాబు భార్య పేరుమీద పట్టా మంజూరు చేసింది. దీంతో తన షెడ్డుకు గల ఆస్తి పన్నును తన భార్య పేరుమీద మార్చాల్సిందిగా సత్తిబాబు దరఖాస్తు చేసుకున్నాడు. పని చేయాల్సిన నెహ్రూనగర్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గణేష్ రూ.25వేలు లంచం డిమాండ్ చేయగా..ఇటీవల రూ.9 వేలు చెల్లించాడు. మిలిగిన రూ.16 వేలు డిమాండ్ చేయడంతో సత్తిబాబు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మిగిలిన సొమ్ము ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ హర్షిత నేతృత్వంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు నిందితుడి నివాసం, ఆఫీసు ప్రాంగణంలో ఈ సోదాలను కొనసాగించారు. దీనికి సంబంధించి రాత్రి 12 గంటలకు కూడా విచారణ కొనసాగింది. నిందితుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నగరంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.


